రామగిరి(నల్లగొండ) : త్రిలింగ క్షేత్రాల వైభవాన్ని, ఆధ్యాత్మిక సౌరభాన్ని ప్రతిబింబించే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైంది. మంగళవారం నుంచి నెల రోజుల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా కార్తీక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కార్తీక మాస ఆగమనాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి ఇల్లు, ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో రోజూ తెల్లవారుజామునే పవిత్ర నదీస్నానాలు ఆచరించి, ఆలయాల్లో దీపారాధనలు చేయడానికి భక్తులు విశేష సంఖ్యలో సమాయత్తమయ్యారు.
నదీతీరాలు.. శివాలయాల్లో ప్రత్యేక పూజలు
కార్తీక మాస తొలి రోజును పురస్కరించుకుని కృష్ణా, మూసీ నదీతీరాల వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు వేకువజామునే క్యూ కట్టారు. జిల్లాలోని చారిత్రాత్మక ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం (పానగల్లు), వాడపల్లి మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం, చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే మల్లెపల్లి మల్లికార్జున స్వామి ఆలయాలు హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మారుమోగుతున్నాయి.
తెల్లవారుజాము నుంచే దీపారాధనలు
కార్తీక మాసంలో ప్రదోషకాల దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మహిళలు ఉదయమే లేచి ఇళ్ల ముందు ముగ్గులు వేసి, ఉసిరి చెట్టు వద్ద, శివాలయ ప్రాంగణాల్లో ప్రమిదలు వెలిగించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కార్తీక సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఆలయాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో అధికారులు, ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూలైన్లు, మంచినీటి సదుపాయాలు కల్పించాయి.
అలరించనున్న కార్తీక వనభోజనాలు
కేవలం పూజలే కాకుండా, బంధుమిత్రులందరూ ఒకచోట చేరి ప్రకృతి ఒడిలో సమయం గడిపే కార్తీక వనభోజనాలు జిల్లావ్యాప్తంగా సందడి తెచ్చిపెట్టనున్నాయి. ఉసిరి వృక్షాల నీడన పూజలు నిర్వహించి భోజనాలు చేయడం ఈ మాస ప్రత్యేకత. వివిధ సంఘాలు, కుటుంబాలు వనభోజనాల కోసం తోటలు, ఫామ్‌హౌస్‌లను ముందస్తుగానే బుక్ చేసుకుంటున్నారు.
ఛాయా సోమేశ్వరాలయంలో పూజలు
చేస్తున్న శివమాలధారణ స్వాములు
ఛాయా సోమేశ్వరాలయం రావిచెట్టు వద్ద పూజలు చేస్తున్న భక్తులు
ఫ భక్తులతో శోభిల్లుతున్న ఆలయాలు
ఫ తెల్లవారుజాము నుంచే
ప్రత్యేక పూజలు, దీపారాధనలు


