సూర్యాపేట(పెన్పహాడ్) : ప్రభుత్వ వైద్య సేవలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న పెన్పహాడ్ మండలం చీదెళ్ళ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ధ్రువీకరణలో ఏకంగా 91.84% అత్యుత్తమ స్కోరు సాధించి జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ పొందింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ అధికారికంగా ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాజేష్ శుక్రవారం తెలిపారు. కేంద్ర నిపుణుల బృందం వర్చువల్ విధానంలో ఈ తనిఖీలు నిర్వహించి, 7 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవల ప్యాకేజీలను క్షుణ్ణంగా పరిశీలించారని వైద్యాధికారి పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు అందుతున్న నిరంతర వైద్య సేవలు, ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగుల భద్రత, మౌలిక సదుపాయాలు, వైద్య రికార్డుల పారదర్శక నిర్వహణ తదితర అంశాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ గుర్తింపు లభించినట్లు ఆయన వివరించారు. ఈ గుర్తింపు పట్ల మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.


