నల్లగొండ(కనగల్) : ఉన్నత చదువుల కోసం ఒక్కగానొక్క కుమార్తెను అమెరికాకు పంపిన ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతుల ఏకై క కుమార్తె శ్రీజ(23) అమెరికాలోని బోస్టన్ నగరంలో ఈ నెల 2వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న శ్రీజ ఆచూకీ శుక్రవారం రాత్రి వరకు కూడా లభించలేదని అమెరికా పోలీసులు తెలిపినట్లు బంధువులు వెల్లడించారు. ఆమె అదృశ్యమైన పరిసర ప్రాంతాల్లో అమెరికా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తమ బిడ్డ జాడ తెలియకపోవడంతో శ్రీజ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతూ కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీజ క్షేమంగా తిరిగి రావాలని బంధువులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మంత్రి కోమటిరెడ్డి నిరంతర పర్యవేక్షణ..
శ్రీజ అదృశ్యమైన ఘటనపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఆచూకీ వీలైనంత త్వరగా కనుగొనేందుకు అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్, కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు కాన్సులేట్ జనరల్‌కు, కేంద్ర విదేశాంగ శాఖకు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. బోస్టన్‌లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ప్రతినిధి కృష్ణప్రసాద్‌తో మంత్రి కోమటిరెడ్డి ఫోన్‌లో మాట్లాడి శ్రీజ ఆచూకీ కోసం చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పంపిన ఈమెయిల్స్ ఆధారంగా స్థానిక పోలీసుల సహకారంతో ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నామని కృష్ణ ప్రసాద్ వివరించారు. మరోవైపు శ్రీజ కుటుంబ సభ్యుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కాన్సులేట్ జనరల్‌ను మంత్రి కోరారు. మంత్రి ఆదేశాల మేరకు ఆయన కార్యాలయం ప్రత్యేకంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రతి గంటకు ఒకసారి తాజా సమాచారాన్ని సేకరిస్తూ అమెరికాలోని ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటోంది.
అమెరికాలోని బోస్టన్‌లో ఈ నెల 2న అదృశ్యమైన శాబ్దుల్లాపురం యువతి
ఇంకా లభించని శ్రీజ ఆచూకీ
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఆమె ఆచూకీ కోసం
మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక చొరవ
కేంద్ర మంత్రి, కాన్సులేట్ జనరల్‌తో నిరంతర సంప్రదింపులు


