నాణ్యమైన ధాన్యానికే మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన ధాన్యానికే మద్దతు ధర

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

పెద్దవూర : జిల్ల్లాలో వానా కాలం సీజన్‌లో సాగుచేసిన వరి పంట చేతికొస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర (ఏ గ్రేడ్‌కు రూ.2461, సాధారణ రకానికి రూ.2441) లభించాలంటే కోతలు, నూర్పిడి సమయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్‌. సత్యనారాయణ సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, వారం రోజుల్లో అన్నీ అందుబాటులోకి రానున్నాయి.

రైతులు పాటించాల్సిన జాగ్రత్తలివే..

● వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతనే కోతలు ప్రారంభించాలి.

● వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసివేయాలి.

● కోతకు 15 నుంచి 20 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి.

● 1010 వంటి రకం వరి బంగారం వర్ణంలోకి వచ్చే వరకు ఆగితే గింజలన్నీ రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని మాత్రం గోధుమ రంగులోకి రాగానే కోయాలి.

● కోసిన వరి మెదళ్లను నాలుగు రోజుల పాటు ఎండనివ్వాలి.

● అనంతరం ఒక్కో రకం వరికి వేర్వేరు కల్లాలు చేసి, టార్ఫాలిన్‌లలో వరి మెదలు వేసి ట్రాక్టర్ల ద్వారా నూర్పిడి చేయాలి.

● ఒక రకం వరి ధాన్యాన్ని మరో రకం ధాన్యంతో కలపొద్దు. పొలం వద్దే గ్రేడింగ్‌ చేయాలి.

● గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకల సహాయంతో తాలు, రాళ్లు లేకుండా తూర్పార పట్టాలి.

● ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండే వరకు ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.

● హార్వెస్టర్‌తో కోస్తే మొదటిసారి పోసే డబ్బాను వేరుగా పోయాలి. ఆ తరువాత కోసినవన్నీ ఒక చోట పోయాలి. ఇలా చేయడం వలన కల్తీ ప్రమాదం తప్పుతుంది.

● వరి గింజలన్నీ సిమెంట్‌ కల్లాలు లేదా టార్ఫాలిన్‌ షీట్లపై ఆరబెట్టాలి. రెండు, మూడు రోజులు బాగా ఎండేలా పారతో, కాళ్లతో కలియదున్నాలి.

● పంట సరిగా ఆరబెట్టకపోతే గింజలు రంగు మారి, పంట నాణ్యత తగ్గే అవకాశం ఉంది.

● పంటను ఆరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెళ్లలు, చెత్తా చెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి.

● నిల్వ చేసే పక్షంలో గోనె సంచులను కింద వేయకుండా కవర్లు పరిచి లేదా బల్లలపై బస్తాలు నెట్టుగా వేయాలి.

● పురుగులు ఆశించకుండా లీటరు నీటికి 5 ఎంఎల్‌ మలాథియాన్‌ మందును కలిపి బస్తాలపై పిచికారీ చేయాలి.

● ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల మధ్య జింక్‌ ఫాస్ఫేట్‌ ట్యాబ్లెట్లు ఉంచాలి. ఒకరోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు వహించాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండా పోతాయి. మరుసటి రోజు నుంచి తలుపులు తీయొచ్చు.

వరి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement