భువనగిరి : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం అవసరమని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌కే ఆరీఫ్ సూచించారు. బుధవారం భువనగిరి పట్టణంలోని సాధన హైస్కూల్లో పోక్సో చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డిజిటల్ వ్యవస్థ దుర్వి నియోగం, దాని వల్ల ఎదురయ్యే ముప్పు, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు, మానవ అక్రమ రవాణా నిరోధక చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో భరోసా సెంటర్ ఎస్సై సంధ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సాయి శ్రీనివాస్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి అనంతలక్ష్మి, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి దశరథ్, పాఠశాల కరస్పాండెంట్ జిట్టా ధనపాల్ రెడ్డి, అడ్వకేట్ మల్లేష్, యుగేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హెచ్‌ఐవీ సేవలు మరింత సులభతరం
భువనగిరి: హెచ్‌ఐవీ సేవలను మరింత సులభంగా అందించేందుకు శిక్షణ దోహదపడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స సేవలను సమర్థంగా అందించేందుకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా భువనగిరిలో నిర్వహిస్తున్న శిక్షణ బుధవారం రెండో రోజు కూడా కొనసాగింది. కార్యక్రమానికి హాజరైన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు హెచ్‌ఐవీ పరీక్షలు, చికిత్సలు మరింత అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, ప్రతినిధులు ఆంథోని రెడ్డి, శాంతి, అశోక్, సుధాకర్ పాల్గొన్నారు.
‘వేద పాఠశాల’ అధ్యక్షుడిగా ధనుంజయ శాస్త్రి
ఆలేరు రూరల్: అఖిల భారత పద్మ బ్రాహ్మణ వేద పాఠశాల సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఆలేరు పట్టణ మార్కండేయ కాలనీకి చెందిన డాక్టర్ పాశికంటి ధనుంజయ శాస్త్రి నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతిలోని పద్మశాలి అన్నదాన సత్రంలో పురోహిత సంఘం అధ్యక్షుడు డాక్టర్ కేశవమూర్తి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుంజయ శాస్త్రిని సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.
క్రీడలతో ఏకాగ్రత పెంపు
భువనగిరి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని డీఈఓ భిక్షపతి ఆకాంక్షించారు. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలమైదానంలో నిర్వహిస్తున్న పీఎంశ్రీ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి బుధవారం హాజరై మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల్లో ఏకగ్రాతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొదిస్తాయన్నారు. విజేత జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ కందాడి దశరథరెడ్డి, గడసందుల మధుసూదన్, వ్యాయామ ఉపాధ్యాయులు నాతి కృష్ణమూర్తి, జోసఫ్, రవిచంద్ర, చంద్రశేఖర్, సంగీత, శోభ, ఇందిరప్రియ, వీరేశం పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
భువనగిరిటౌన్ : ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మెకు బుధవారం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఏజెన్సీలను రద్దు చేసి స్టేట్ హెల్త్ సొసైటీ కిందకు తేవాలన్నారు. 5లోపు వేతనాలు, 180 రోజుల ప్రసూతి సెలవులు, మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు.


