భువనగిరిటౌన్ : ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే తీవ్ర నీటి ఎద్దడిని ముందస్తుగానే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కలెక్టర్ మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులను ‘జల సంరక్షణ రాయబారులు’గా క్షేత్రస్థాయిలోకి దించింది.
బృందాలుగా విడిపోయి సర్వే
జిల్లావ్యాప్తంగా ఉన్న 189 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలకు చెందిన విద్యార్థులు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో బుధవారం పర్యటించారు. పంచాయతీ కార్యదర్శుల సహకారంతో జల సర్వే నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న ఇంకుడు గుంతలు ఎన్ని? వాటిలో పనిచేస్తున్నవి, పూడికకు గురైనవి ఎన్ని? రోజువారీ నీటి వినియోగం ఏ స్థాయిలో ఉంది? తదితర అంశాలపై లోతైన ఆడిట్ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.
ఆలోచింపజేసిన జల పాఠాలు
సర్వే అనంతరం విద్యార్థులు గ్రామస్తులను ఒకచోట చేర్చి నీటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. వర్షపు నీరు డ్రెయినేజీల్లో వృథాగా పోకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకింపజేయాలని కోరారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదని వారు చెప్పిన మాటలు పల్లె ప్రజలను విశేషంగా ఆలోచింపజేశాయి. ప్రతి వర్షపు బొట్టునూ ఒడిసిపట్టడమే లక్ష్యంగా చిన్నారులు చేపట్టిన ఈ కార్యక్రమం అందరి మన్ననలు పొందుతోంది.
ఫ ఊరూరా విద్యార్థుల జల చైతన్యం
ఫ ఎల్‌నినోపై 9వ తరగతి విద్యార్థులతో అవగాహన
ఫ 189 పాఠశాలల భాగస్వామ్యంతో ఇంకుడు గుంతలపై సర్వే


