సాక్షి, యాదాద్రి : జిల్లాలో జనగణన ప్రక్రియను పకడ్బందీగా, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని తెలంగాణ జనగణన కార్యకలాపాల సంచాలకురాలు భారతి హోలికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జనగణన–2027పై నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్ష, శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. జనగణన ప్రక్రియ విజయవంతానికి పక్కా ప్రణాళిక, క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జనగణనలో భాగంగా నివాసాల గుర్తింపు, గణన విభాగాల విభజన, స్వీయ నమోదు ప్రక్రియ, ప్రతి పౌరుడిని గణన పరిధిలోకి తీసుకురావడం వంటి అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. జనగణన ప్రక్రియలో ప్రతి నివాస జాబితా విభాగానికి సంబంధించిన జనాభా వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే గణన విభాగాలను రూపొందించాలని స్పష్టం చేశారు. సాధారణంగా ఒక్కో గణన విభాగంలో సుమారు 800 మంది జనాభా ఉండేలా సమతుల్యత పాటించాలని, ఆయా ప్రాంతాల సరిహద్దులను స్పష్టంగా గుర్తించి గందరగోళానికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలే స్వయంగా ఇంటర్నెట్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. జనగణన వివరాల్లో విశ్వసనీయత, కచ్చితత్వాన్ని కాపాడేందుకు చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు, సహాయక సిబ్బంది అంతా సమష్టి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా సమన్వయకర్త రవీందర్ నాయక్, వివిధ డివిజన్ల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఫ జనగణన కార్యకలాపాలసంచాలకురాలు భారతి హోలికేరి
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి అధికారులతో సమీక్ష


