ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాను. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఇంకా ఏర్పాటు చేయలేదు. వాతావరణం చూస్తే ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతాను. ప్రైవేట్ అమ్ముకోవడానికి గంటకు రూ. 2వేల చొప్పున పెట్టి వరి కోత మిషన్ సాయంతో పంటను కోస్తున్నాను.
– బండ శ్రీను, కామూనిగూడెం,
ఆత్మకూరు(ఎం) మండలం
యాదగిరిగుట్ట: అర్నబ్ తుపాన్ రైతులను కలవరపెడుతోంది. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో దిగుబడి తగ్గి ఆందోళనలో ఉన్న అన్నదాతలు.. తాజా తుపాన్ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు. చేతికొచ్చిన పంట ఎక్కడ వర్షార్పణం అవుతుందోననే భయంతో యంత్రాల ద్వారా వరి కోతలను ముమ్మరం చేశారు. జిల్లాలో ఈ వానాకాలంలో సుమారు 2.30 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.
వాతావరణం చల్లబడడంతో..
రెండు రోజులుగా వాతావరణం చల్లబడి ఎండలు లేకపోవడంతో, కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కోతలు కోసిన వెంటనే కల్లాల వద్దే ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించడం, రవాణా, తరుగు, క్లీనింగ్ ఖర్చుల భారం లేకుండా పొలాల వద్దే అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రభావం ఉండదంటున్న అధికారులు
జిల్లాలో తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదని అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లా సరిహద్దు మండలాలైన మోత్కూర్, అడ్డగూడూరులలో మాత్రమే బుధవారం చిరుజల్లులు కురిశాయని, జిల్లా వ్యాప్తంగా చల్లటి గాలులు వీయడం మినహా భారీ వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలో ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్ముతున్న రైతులు
రాజాపేట మండలంలో వరి పంట కోస్తున్న యంత్రం
ఫ యంత్రాలతో వరి కోతలు ముమ్మరం చేసిన రైతులు
ఫ వర్షం వస్తుందేమోనని కల్లాల వద్దే ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయాలు
ఫ జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు


