నడిగూడెం : ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం క్షేత్ర పంటల సాగు రైతులతో పాటు, ఉద్యానవన పంటల రైతులకు కూడా కష్టతరంగా మారింది. ఖరీఫ్ సీజన్‌లో సరైన వర్షాలు లేవు. దీంతో చెరువులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటాయి. దీనికి తోడు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో క్షేత్ర పంట అయిన వరి పొలాలకు నీరందక పంట చేతికొచ్చే దశలో ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి నిమ్మ తోటల రైతులకు ఆరంభమైంది. నడిగూడెం మండల కేంద్రంతో పాటు, బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం, వెంకట్రాంపురం, కరివిరాల, కాగితరామచంద్రాపురం, నారాయణపురం, ఎఖలాస్‌ఖాన్‌పేట తదితర గ్రామాల్లో దాదాపు రెండు వేల ఎకరాల వరకు నిమ్మ సాగు చేశారు. ఈ నిమ్మ తోటలు ఆయా గ్రామాల్లో బోర్లు, బావుల కింద సాగులో ఉన్నాయి. వేసవి రాక ముందే ప్రస్తుత వాతావరణం వేసవిని తలపిస్తుండడం, బోర్లు, బావుల్లో భూగర్భ అడుగంటడంతో నిమ్మ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగర్ నీటితో చెరువులు నింపాలి
మండల పరిరిధిలోని చెన్నకేశ్వాపురం, కరివిరాల, వేణుగోపాలపురం, బృందావనపురం, నారాయణపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల్లో ఉన్న చెరువులను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అనుబందంగా ఉన్న ఎల్.35, ఎల్.36 ఎత్తి పోతల పధకాల ద్వారా నింపాలని రైతులు కోరుతున్నారు. నిమ్మలో పూత, పిందె రావడానికి అనువైన సమయం ఇదేనని, ఇలాంటి సమయంలో సాగు నీరుంటే పంట దిగుబడులు పెరిగే అవకాశముంటుందని పలువురు రైతులు చెబుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి సాగర్ నీటితో చెరువులను నింపాలని నిమ్మ రైతులు కోరుతున్నారు.
ఫ ఎల్‌నినో ప్రభావంతో అడుగంటిన భూగర్భ జలాలు
ఫ పంట చేతికొచ్చే దశలో నీరు అందక ఎండిపోతున్న తోటలు
ఫ సాగర్ నీటితో చెరువులను నింపాలని కోరుతున్న నిమ్మ రైతులు


