చిట్యాల: లారీ ఢీకొని మున్సిపాలిటీ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల పట్టణంలో గురువారం జరిగింది. వివరాలు.. చిట్యాలలోని ఇందిరానగర్‌కు చెందిన పాల మల్లయ్య(65) చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడు గురువారం ఉదయం చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో గల శ్రీకనకదుర్గా ఆలయం వైపు నుంచి నడుచుకుంటూ మున్సిపాలిటీ కార్యాలయానికి వస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న లారీ శ్రీకనకదుర్గా ఆలయం వద్ద యూటర్న్ తీసుకుంటూ మల్లయ్యకు ఢీకొట్టింది. లారీ మల్లయ్య పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులతో పాటు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
గతంలోనూ ముగ్గురు మృతి..
శ్రీకనకదుర్గా ఆలయం ఎదురుగా భువనగిరి వైపు వెళ్లే యూటర్న్ బ్లాక్ స్పాట్‌గా మారింది. ఈ యూటర్న్ వద్ద 2021లో సైతం మున్సిపాలిటీ కార్యాలయంలో చెత్త తరలించే ఆటో డ్రైవర్‌గా చిత్రగంటి ఉపేందర్ నడుచుకుంటూ వెళ్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. అదేవిధంగా 2010లో చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదురుగా పారిశుధ్ధ్య విధుల్లో ఉన్న ఇద్దరు మహిళలను లారీ ఢీకొనడంతో
మృతి చెందారు.


