మాడుగులపల్లి: స్కూటీని ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటన మాడుగులపల్లి మండలం చెర్వుపల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెర్వుపల్లి గ్రామానికి చెందిన మద్దెల అంజలి(35) తన కుమార్తె సంధ్యతో కలిసి స్కూటీపై పని నిమిత్తం మాడుగులపల్లికి వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజలి కిందపడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. ఆమె కుమార్తె కూడా రోడ్డుపై పడిపోయింది. స్థానికులు వారిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంజలి మృతిచెందింది. మృతురాలి సోదరి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్యాదవ్ తెలిపారు. అంజలి భర్త రెండేళ్ల క్రితం మృతిచెందగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు కుమార్తెలు అనాథగా మారారని చెర్వుపల్లి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.


