పెద్దవూర : ఎల్నినో ప్రభావంతో వానాకాలం సీజన్లో జిల్లాలో కంది పంటను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ప్రస్తుతం కంది పూత దశలో ఉంది. ఈ దశలో సస్యరక్షణ పద్ధతులు సకాలంలో చేపడితేనే మేలైన దిగుబడులు సాధించవచ్చని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచించారు. కందిని ఆశించే తెగుళ్లు, పురుగులు, వాటి నివారణ చర్యలను ఆయన వివరించారు.
1. ఆకుచుట్టు పురుగు : లేత దశలోనే తల్లి పురుగులు ఆకుల ఈనెల పక్కన గుడ్లు పెడతాయి. లార్వాలు పత్రహరితాన్ని గీకి తింటూ, ఆకులను చుట్టేసి గూడు కట్టుకుంటాయి. దీంతో ఆకులు మడతపడి, చుట్టుకుపోయి ఎండిపోతాయి. ఆకులపై ఎండు మచ్చలు (బొబ్బలు) ఏర్పడతాయి.
నివారణ : వేప సంబంధిత మందులు వాడాలి. లీటర్ నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
2. పూత పురుగు (మారుకా మచ్చల పురుగు) : ఇవి లేత ఆకులు, పూతపై గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు (లార్వాలు) మొక్క చివరన గూడు కట్టుకుని పూలు, మొగ్గలు, ఆకులను తింటూ పెరుగుతాయి.
నివారణ : పురుగు ప్రారంభ దశలో ఎకరాకు లీటర్ వేపనూనె పిచికారీ చేయాలి. లేదా లీటర్ నీటిలో మోనోక్రోటోఫాస్, డైక్లోర్వాస్ 1.6 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్, డైక్లోర్వాస్ 0.1 మి.లీ లేదా కేవలం డైక్లోర్వాస్ (నువాన్) 1 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే పూత పురుగు బెడద తప్పుతుంది.
3. శనగపచ్చ పురుగు : ఈ పురుగు లేత ఆకుల మీద, పూ మొగ్గల మీద, కాయల మీద విడిగా ఒక్కొక్క గుడ్డు పెడుతుంది. గుడ్డు నుంచి వెలువడిన పిల్ల పురుగులు పత్రహరితాన్ని పూ మొగ్గలను గీకి తింటుంటాయి. తదుపరి మొగ్గలు, కాయలు, పూలను తొలచి నష్టపరుస్తాయి. ఇవి కాయ లోపలికి తలను ఉంచి, మిగిలిన శరీరాన్ని బయటే ఉంచి లోపల గింజలను తినేస్తాయి. ఒకే పురుగు చాలా పంటకు నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు ఆశించిన కంది కాయలోని ప్రతి కణుపుకు గుండ్రని రంధ్రాలు కనిపిస్తుంటాయి.
4. కాయ ఈగ : తల్లి పురగులు నల్లటి ఈగ ఆకారంలో ఉండి కంది పిందెలు, కాయలపై కవచాల్లోకి తమ ప్రత్యేక అవయవాలతో గుడ్లను లోపలికి చొప్పిస్తాయి. వీటి నుంచి వెలువడే తెల్లని కాళ్లులేని పిల్ల పురుగులు కాయలోని గింజల పైభాగంలో దారులు చేసుకుంటూ పెరుగుతాయి. ఈ క్రమంలో ఇవి గింజ లోపలి భాగమంతా డొల్లగా చేస్తాయి. కాయ లోపలి పురుగు మొక్క ఉనికిని కాయ కవచంపై ఏర్పడే పల్చటి పొర ద్వారా గుర్తించవచ్చు. కాయ నుంచి పురుగు వెలువడిన గుర్తుగా చిన్న రంధ్రం కాయ పైభాగంలో ఏర్పడుతుంది.
నివారణ : తల్లి పురుగులను గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ ప్రొఫెనోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు : నేలలో తగినంత తేమ ఉన్నా మొక్కలు నీటి ఎద్దడికి గురైనట్లు పసుపు రంగులోకి మారి వడలిపోతాయి. పై కొమ్మ నుంచి కింది కొమ్మ వరకు ఎండిపోతాయి. కాండంపై బెరడు తీసి చూస్తే నలుపు చారలు ఉంటాయి. క్రమంగా కాండం మొత్తం నల్లబడుతుంది. ఈ శిలీంధ్రం నేలలో ఎన్నో ఏళ్లు జీవించి, 3 మీటర్ల మేర వ్యాపిస్తుంది. 35 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకోగలదు.
నివారణ : ఎండు తెగులును తట్టుకునే రకాలను సాగు చేయాలి. తెగులు ఆశించిన పొలాల్లో జొన్న లేదా పొగాకు పంటల మార్పిడి చేయాలి. 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండిలో 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి ఫార్ములేషన్ కలిపి నీళ్లు చల్లి, బస్తా కప్పి 10 రోజుల పాటు నీడలో ఉంచాలి. ఆకుపచ్చని శిలీంధ్రం రాగానే ఆ ఎరువును ఎకరం పొలంలో చల్లాలి. విత్తే ముందే కిలో విత్తనానికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకుంటే పైరును కాపాడుకోవచ్చు.
పెద్దవూర మండల వ్యవసాయాధికారి
సత్యనారాయణ సూచనలు


