సూర్యాపేట : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను కోర్టులో హాజరుపర్చగా జడ్జి వారికి జైలుశిక్ష, జరిమానా విధించినట్లు సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఆరుగురిని గురువారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా.. ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలుశిక్ష, జరిమానా, మరొకరికి మూడు రోజుల జైలుశిక్ష, జరిమానా, మరో ముగ్గురికి జరిమానా, పనిష్మెంట్ విధిస్తూ ప్రిన్సిపల్ జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ పేర్కొన్నారు.
బైక్‌ను ఢీకొట్టిన బొలేరో.. ఒకరు మృతి
చిట్యాల : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బొలేరో వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం ఉరుమడ్ల–ఆరెగూడెం గ్రామాల మధ్యన గురువారం జరిగింది. చిట్యాల పట్టణానికి చెందిన చెందిన ఎస్కే. గౌస్ పాషా(37) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని నిమిత్తం గురువారం ఆరెగూడెం గ్రామానికి బైక్‌పై వెళ్లాడు. అక్కడి నుంచి ఉరుమడ్ల గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌస్ పాషా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు. పోలీసులు గౌస్ పాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం నల్లగొండ ప్రభుత్వాస్పకి తరలించారు.
రైల్లో నుంచి జారిపడి ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని పెద్దబండ సమీపంలో గురువారం రైల్లో నుంచి జారిపడి ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయింది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షతగాత్రుడికి ఘటనా స్థలంలోనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
చిట్యాల : హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోకి రాగానే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు, బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. దీంతో హైవేపై కాసేపు ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. హైవే నిర్వహణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
డీసీఎం ఢీకొని గాయాలు
దేవరకొండ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన దేవరకొండ పట్టణ శివారులోని జంగాలకాలనీ వద్ద గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం గాగిళ్లాపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు తంగెళ్ల రామకృష్ణారెడ్డి తన ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో దేవరకొండ వైపు వస్తున్న డీసీఎం స్థానిక జంగాలకాలనీ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణారెడ్డి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను స్థానికులు దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.


