గుర్రంపోడు : కాయల కోతలు ముగిసి విశ్రాంతి దశలో ఉన్న బత్తాయి తోటల్లో వేసవి పంట సాధనకు ఇదే సరైన సమయం. వర్షాకాలంలో వచ్చే కాయలతో పోలిస్తే, వేసవిలో లభించే పంటకు రెండింతల అధిక ధర లభిస్తుంది. ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉన్నందున, రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వేసవిలో అధిక దిగుబడి పొందాలంటే ఈ నెలలోనే చెట్లను వాడుపట్టాలి. తగిన యాజమాన్య మెళకువలు పాటించడం ద్వారా మంచి దిగుబడి, లాభాలు పొందవచ్చని హాలియా ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి మురళి రైతులకు సూచిస్తున్నారు.
లేత తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– తోటలను దున్నడం, పాదులు తవ్వడం, ఎండు పుల్లలను తొలగించడం వంటి పనులను పూర్తిచేయాలి.
– ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నీటి తడులు ఆపివేసి చెట్లను వాడుకు గురిచేయాలి.
– ప్రతి చెట్టుకు 40 కిలోల పశువుల ఎరువు (లేదా 10 కిలోల వర్మి కంపోస్ట్), 3.5 కిలోల ఆముదం లేదా వేప పిండి, 600 గ్రాముల యూరియా, 900 గ్రాముల సింగిల్ సూపర్ పాస్ఫేట్ మరియు 400 గ్రాముల పొటాష్‌ను పాదులో సమంగా వేయాలి.
– ఎరువులు వేసిన తర్వాత తడులు ఇస్తే లేదా మంచి వర్షం కురిస్తే చెట్లు పూతకు వస్తాయి. ఈ పూత ద్వారా వచ్చే కాయలు మే నెలలో కోతకు వస్తాయి.
ముదురు తోటల్లో ఇలా..
– ప్రస్తుతం కాపునిస్తున్న ముదురు తోటల్లో ప్రతి చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప లేదా ఆముదం పిండి, 750 గ్రాముల యూరియా, 1200 గ్రాముల సింగిల్ సూపర్ పాస్ఫేట్ మరియు 500 గ్రాముల పొటాష్ అందించాలి.
– కొత్తగా వచ్చే చిగుర్లు, రెమ్మలను కాపాడుకోవడానికి లీటరు నీటికి 1.5 మి.లీ మోనోక్రోటోఫాస్ మందును పిచికారీ చేయాలి.
– లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 2 గ్రాముల మాంగనీస్ సల్ఫేట్, 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము బోరాక్స్, 6 గ్రాముల సున్నం, 10 గ్రాముల యూరియా కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వర్షాకాలంలో ఆశించే
చీడపీడల నివారణ
గజ్జి తెగులు: ఆకులు, కొమ్మలపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి.
నివారణ: 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్, 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి 20 రోజులకు ఒకసారి రెండుసార్లు పిచికారీ చేయాలి.
కాయ తొడిమ కుళ్లు తెగులు: తొడిమ చుట్టూ మచ్చ ఏర్పడి కాయలు కుళ్లిపోతాయి.
నివారణ: నెలకోసారి గ్రాము కార్బండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
దోమకాటు: రాత్రివేళల్లో దోమలు కాయల రసాన్ని పీల్చడం వల్ల కాయలు కుళ్లిపోతాయి.
నివారణ : తోటలో రాత్రిపూట లైట్లు పెట్టి, ప్లేట్లలో 1 మి.లీ మలాథియాన్, 1 శాతం చక్కెర, పండ్లరసం కలిపిన విషపు ఎరను ఉంచాలి.
అంతరకృషి పనులకు సమయమిదే..
రైతులకు ప్రాంతీయ ఉద్యానవనశాఖ అధికారి మురళి సూచన


