మా భూములు ఇవ్వం.. | - | Sakshi
Sakshi News home page

మా భూములు ఇవ్వం..

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

అలైన్‌మెంట్‌ను మార్చాలి

మొగిలిదొరి గ్రామంలోని 618, 619 సర్వేనెంబర్లలో నాకున్న రెండు ఎకరాల భూమిలో ఉదయ సముద్ర ప్రాజెక్టు కాలువ పోతుంది. కాల్వకు ఎకరం భూమి పొతున్నట్లు నోటీసులు ఇచ్చారు. మా భూమి మధ్యలో నుంచి కాలువ పోవడంతో ఇబ్బంది అవుతుంది. పరిహారం కూడా తక్కువగా ఇస్తున్నారు. అలైన్‌మెంటు మార్చి కాలువ నిర్మాణాన్ని చేపట్టాలి.

– కొడూరి కనకయ్య, రైతు, మొగిలిదొరి

చిట్యాల : ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న ఎడమ కాలువకు భూములివ్వబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. మంగళవారం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాభిసేకరణలో చిన్నకాపర్తి, మొగలిదొరి గ్రామాలకు చెందిన రైతులు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి, ప్రాజెక్టు ఏఈ నవీన్‌కుమార్‌తో పాటు ఇతర అధికారులకు తమ అభ్యంతరాలను తెలియజేశారు. అంతేకాకుండా అధికారులు ఇచ్చిన భూసేకరణ నోటీసుల్లో తమ పేర్లు లేవని, పైపులైన్‌ నిర్మాణాలు, చెట్లు ఉన్నా.. చేర్చలేదని పలువురు పేర్కొన్నారు. కాల్వ అలైన్‌మెంట్‌ మార్చాలని కోరారు.

34 ఎకరాల 11 గుంటల

భూసేకరణకు నోటీసులు

ఉదయ సముద్ర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల నుంచి చిన్నకాపర్తి గ్రామ రెవెన్యూ పరిధి నుంచి మునుగోడు మండలం క్రిష్టాపురం వరకు కాల్వ నిర్మాణానికి 66 మంది రైతులకు చెందిన సుమారు 34 ఎకరాల 11 గుంటల భూమి సేకరణకు అధికారులు భూసేకరణ చట్టం–2013 ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసి రైతులకు నోటీసులను అందజేశారు. దీంతో ఈ కాల్వ నిర్మాణంతో సుమారుగా చిన్నకాపర్తి రెవెన్యూ పరిధిలో పదమూడు వేల ఎకరాల ఆయకట్టుకు నీటి స్థిరికరణ ఏర్పడనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మార్కెట్‌ విలువ రూ.40 లక్షలు..

పరిహారం రూ.17 లక్షలే..

చిన్నకాపర్తి రెవెన్యూ పరిధిలోని భూములకు ఎకరానికి బహిరంగ మార్కెట్‌లో రూ.నలబై నుంచి యాబై లక్షల రూపాయల వరకు ఉంది. ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం రూ.17 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో తమకు న్యాయమైన పరిహారం అందడం లేదని రైతులు అంటున్నారు. మరికొందరు భూమికి పరిహారంగా మరొక చోట భూమిని కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. భూములను కాపాండేందుకు అలైన్‌మెంట్‌ను మార్చాలని మరి కొందరు రైతులు అధికారులను కోరారు. ఈ క్రమంలో పలువురు రైతులు అధికారులతో వాగ్వాదం చేశారు. అనంతరం తమ భూములు ఇవ్వబోమంటూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు.

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తా : డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి

భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలు, అవసరాల మేరకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు న్యాయమైన పరిహారం అందించే అంశాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తానని ఆమె వివరించారు. కాలువ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదని, ప్రస్తుత అలైన్‌మెంట్‌లో మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.

ఫ కాల్వ అలైన్‌మెంట్‌ మార్చాలి

ఫ అధికారులకు మొరపెట్టుకున్న ఉదయ సముద్రం లిఫ్ట్‌ కాల్వ రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement