చిన్నారుల పాలపొడి పక్కదారి | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల పాలపొడి పక్కదారి

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

కర్నాటక టు తెలంగాణ

ఆలేరు : చిన్నారుల కడుపు నింపాల్సిన పాలపొడి.. అక్రమార్కుల జేబులు నింపే సరుకుగా మారింది. కర్నాటకలో అంగన్‌వాడీలు, పాఠశాలల చిన్నారుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న పాలపొడి అక్రమ మార్గంలో తెలంగాణకు చేరుతుంది. ఈ అక్రమ దందా గుట్టును యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పోలీసులు రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక ప్రభుత్వం పిల్లల కోసం ‘క్షీరభాగ్య’ పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌కు చెందిన ‘నందిని’ హోల్‌మిల్క్‌ పౌడర్‌ను కిలో ప్యాకెట్ల రూపంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. విక్రయించడానికి వీల్లేకుండా ప్యాకెట్లపై నాట్‌ ఫర్‌ సేల్‌ అని స్పష్టంగా ముద్రించి ఉంటుంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కర్ణాటక నుంచి సరిహద్దులు దాటించి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం రాత్రి ఆలేరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌, క్రైం పార్టీ సిబ్బందితో కలిసి స్థానిక పోచమ్మగుడి సమీపంలోని ఓ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఏడు సంచులను తెరిచి చూడగా, అందులో కర్ణాటక ప్రభుత్వ ఉచిత పాలపొడి ప్యాకెట్లు బయటపడ్డాయి. సుమారు 210 కిలోల పాలపొడి ప్యాకెట్లను పోలీసులు సీజ్‌ చేశారు.

హైదరాబాద్‌కు చెందిన ‘ దయ’ హస్తం..

ట్రాన్స్‌పోర్ట్‌ యజమానిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతడిని విచారించగా, హైదరాబాద్‌కు చెందిన దయ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. దయ ద్వారానే కర్నాటక పాలపొడి ప్యాకెట్లు ఆలేరుకు వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. ఈ పాలపొడిని పన్నీరు, స్వీట్ల తయారీ కోసం అక్రమంగా వాడుతున్నట్లు తేలింది. ఆలేరు నుంచి ఈ ప్యాకెట్లను జనగామ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా తరలిస్తున్నట్లు పోలీ సుల విచారణలో వెల్లడైంది. అయితే, ఈ ప్యాకెట్లు చివరగా ఎవరికి చేరుతున్నాయి? ఎక్కడ నిల్వ చేస్తున్నారు? ఎవరి ద్వారా విక్రయిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఎంతమంది ఉన్నారు? అసలు కర్ణాటక నుంచి ఈ నెట్‌వర్క్‌ ఎంతకాలంగా నడుస్తోంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫ ఆలేరులో భారీగా కర్నాటక ప్రభుత్వ ఉచిత పాలపొడి

ప్యాకెట్ల సీజ్‌

ఫ 210 కిలోల నందిని బ్రాండ్‌ పాలపొడి పట్టివేత

ఫ హైదరాబాద్‌ నుంచి ఆలేరు మీదుగా జనగామకు అక్రమ రవాణా

ఫ పన్నీర్‌, స్వీట్ల తయారీకి

వినియోగిస్తున్నట్లు గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement