ఫ సొంత ఇంటి నుంచి గెంటేసిన కొడుకు
ఫ అధికారుల సమక్షంలో
సగౌరవంగా సొంతింట్లోకి..
మిర్యాలగూడ : కన్న కొడుకు చేతిలో మోసపోయి, సొంత ఇంటి నుంచే గెంటివేయబడిన వృద్ధ దంపతులకు నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ చొరవతో న్యాయం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఆ దంపతులను మిర్యాలగూడ పట్టణంలోని వారి సొంత ఇంట్లో సగౌరవంగా ప్రవేశపెట్టారు.
కొడుకు పేరిట ఇల్లురాయడంతో..
మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్న సింగం యాదమ్మ, అంజయ్య దంపతులకు చైతన్యనగర్ రోడ్ నెం.7లో సొంత ఇల్లు ఉంది. 65 ఏళ్ల అంజయ్య రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు మృతి చెందాడు. పిల్లల విద్యాభ్యాసం, వివాహాలు, ఇతర బాధ్యతలను ఈ దంపతులు తమ శక్తిమేరకు నెరవేర్చారు. వీరికి త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. చైతన్యనగర్ రోడ్ నెం.7లోని సొంత ఇంట్లోనే గత 10, 12 ఏళ్లుగా నివసిస్తున్నారు. అయితే, ఆ ఇంటిని కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతో వారి కష్టాలు మొదలయ్యాయి. ఇల్లు తన పేరు మీదకు మారగానే కుమారుడు వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా వేధింపులకు గురిచేశాడు. వారిపై భౌతిక దాడులకు సైతం పాల్పడ్డాడు. తాను ఆ ఇంట్లో నివాసం ఉండకపోగా, తల్లిదండ్రులను ఉండనివ్వకుండా ఇంటిని ఖాళీగా ఉంచాడు. దీంతో వారు హౌసింగ్ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్నారు. తమకు న్యాయం చేయాలని గత నెలలో ఆర్డీఓ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
స్పందించిన కలెక్టర్..
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ చంద్రశేఖర్.. వృద్ధులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆర్డీఓ ఎస్. రమణారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఆర్డీఓ.. వృద్ధ దంపతులకు వారి ఇంట్లో నివాసం కల్పించాలని ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం స్థానిక సీఐ నాగభూషణం ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ, వయోవృద్ధుల సంక్షేమ శాఖల సిబ్బంది ఆ వృద్ధ దంపతులను చైతన్యనగర్‌లోని వారి సొంతింటికి తీసుకెళ్లి నివాసం కల్పించారు.


