కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో రెండు వేర్వేరు చోట్ల గంజాయి, మత్తు కలిగించే దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. కోదాడ పట్టణ పరిధిలోని గుడిబండ రోడ్డులో ఉన్న ఆర్‌ఎస్ నగర్ వెంచర్‌లో గంజాయి క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన కన్నెగంటి ఈశ్వర్ గోపీనాథ్ అలియాస్ నాని, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన బత్తుల మణి పోలీసులకు పట్టుబడ్డారు. వీరు ఏపీ, ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, నేరేడుచర్ల, మేళ్లచెర్వు తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అఖిల్ అనే వ్యక్తికి ఒక కిలో గంజాయి ఇచ్చి, అతని వద్ద నుంచి 25 మత్తు కలిగించే దగ్గు సిరప్‌లు తీసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో అఖిల్ అక్కడి నుంచి పరారు కాగా.. ఈశ్వర్ గోపీనాథ్, మణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సిరప్‌లతో పాటు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అఖిల్‌తో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.
మరో కేసులో..
అదేవిధంగా కోదాడ పట్టణ పరిధిలోని సింగారం రోడ్డులో ఉన్న ఎఫ్‌సీఐ గోదాము వద్ద గంజాయి విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన పంకజ్ మండల్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 1.3 కిలోల గంజాయిని(56 ప్యాకెట్లు) స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ రెండు కేసుల్లో నిందితుల నుంచి మొత్తం 3.3 కిలోల గంజాయి, 25 మత్తు కలిగించే దగ్గు సిరప్‌లు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశంలో సీఐ శివశంకర్, ఎస్‌ఐ అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల కార్డన్ సెర్చ్
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని అన్నదురై నగర్‌లో మంగళవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో రూరల్ సీఐ రాజశేఖర్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్‌ఐలు, 50 మంది సిబ్బంది కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 50 వాహనాలను సీజ్ చేశారు.
ఫ రెండు వేర్వేరు కేసుల్లో
పట్టుకున్న పోలీసులు
ఫ 3.3 కిలోల గంజాయి,
25 మత్తు సిరప్ బాటిళ్ల స్వాధీనం
ఫ పరారీలో మరో ఐదుగురు
ఫ వివరాలు వెల్లడించిన
కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి


