ఫ విత్తన లోపమే కారణమని
నిర్ధారించిన వ్యవసాయాధికారులు
సాక్షి, యాదాద్రి : వరి సాగు చేస్తే నకిలీ విత్తనాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం బాహుపేటకు చెందిన రైతు పంజాల గోవర్దన్ ఎకరం పొలానికి సరిపడేలా 20 కిలోల వరి విత్తనాలను కొనుగోలు చేశాడు. నారు పోసి కలుపు తీయడం, పురుగు మందుల వరకు ప్రతి దశలోనూ ఎంతో ఖర్చు పెట్టాడు. కానీ పంట పొట్ట దశకు వచ్చిన తర్వాత రైతుకు తీవ్ర నిరాశే మిగిలింది. పంట ఈనే సమయంలో ధాన్యం గింజలకు బదులుగా.. ఒడిపిలి మాత్రమే వచ్చాయి. చేతికొచ్చిన పంటంతా ఒడిపిలిగా మారడంతో రైతు కన్నీటిపర్యంతమయ్యాడు.
విత్తన లోపమేనని అధికారుల నిర్ధారణ..
పంట దెబ్బతిన్న విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి పొలాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించి.. విత్తన లోపమే కారణమని నిర్ధారించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం ఇప్పించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.


