స్టార్టర్‌ బాక్సులు చోరీ | - | Sakshi
Sakshi News home page

స్టార్టర్‌ బాక్సులు చోరీ

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

చిట్యాల : మండలంలోని వెలిమినేడు గ్రామ పరిధిలోని బొంతల రామకృష్ణారెడ్డి, బైకాని ముత్తయ్య, దాసరి కృష్ణమ్మ, ఈరటి యాదయ్య, దాసరి ఐలయ్యతో పాటు మరో ఐదుగురు రైతుల వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన బోరు మోటార్ల స్టార్టర్‌ బాక్సులను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఒక్కొక్క స్టార్టర్‌ బాక్సు విలువ సుమారు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉంటుందని బాధిత రైతులు పేర్కొన్నారు. దొంగలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గొర్రెల అపహరణ

చిట్యాల : మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన జాల ఎర్రయ్య గొర్రెల మందలో నుంచి రెండు గొర్రెలను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. అదే గ్రామానికి చెందిన దోటి భిక్షం దొడ్డి వద్ద ఉంచిన రెండు గొర్రెలను నాలుగు రోజుల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. గొర్రెలను అపహరించిన దొంగలను గుర్తించి తగిన న్యాయం చేయాలని బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చికిత్స పొందుతూ మృతి

భూదాన్‌పోచంపల్లి : రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతి చెందాడు. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన చుక్క కృష్ణ(28) పోచంపల్లి తహసీల్దార్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 10న బోనాల పండుగకు భువనగిరిలోని అత్తాగారింటికి వెళ్లి సాయంత్రం బైక్‌పై హైదరాబాద్‌కు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం సమీపంలో సర్వీస్‌రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణ తల, మెడకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడిని మొదట ప్రైవేట్‌ ఆస్పత్రికి.. అనంతరం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతడి తలకు శస్త్రచికిత్స చేసినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. 50 రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతి చెందాడు. మంగళవారం స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఆరు నెలల వయస్సున్న కుమారుడు ఉన్నారు.

నాణ్యమైన భోజనం

అందించాలని విద్యార్థుల ధర్నా

సంస్థాన్‌ నారాయణపురం : మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్‌ చేస్తూ సంస్థాన్‌ నారాయణపురం ప్రభుత్వ బాలుర హాస్టల్‌ ఎదుట మంగళవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థుల నిరసనకు ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. హాస్టల్‌లో అన్నం సరిగ్గా ఉండడం లేదని, నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు కోరారు. హాస్టల్‌ గదులు, పరిసరాలను సరిగ్గా శుభ్రం చేయడం లేదని ఆరోపించారు. పారిశుద్ధ్యం లోపించడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులు లేవని, వాపోయారు. విరిగిపోయిన తలుపులకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గతంలో కలెక్టర్‌ హాస్టల్‌ను పలుమార్లు ఆకస్మికంగా తనిఖీ చేసినా ఫలితం లేదని విద్యార్థులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement