కోదాడ: చికిత్స కోసం ఆసుపత్రికికు వచ్చిన రోగి పట్ల ఓ వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. వృద్ధ మహిళ అని కూడా చూడకుండా నెట్టివేశాడు. దీంతో సదరు మహిళ కిందపడిపోయి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో వెళ్లింది. తలకు గాయమై తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను వైద్యశాల సిబ్బందే చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోగి కుమారుడు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం చెరువుతండాకు చెందిన పరింగిని తన కుమారుడు చందుతో కలిసి మఠంపల్లిలో నివాసం ఉంటోంది. తల్లికి ఆయాసం రావడంతో చందు సోమవారం ఉదయం కోదాడ పట్టణంలోని శ్యామల నర్సింగ్‌హోంకు తీసుకొచ్చాడు. పరిశీలించిన వైద్యుడు సైదానాయక్ కొన్ని పరీక్షలు రాశాడు. వాటిని చేయించుకొని రిపోర్టులు తీసుకొని మధ్యాహ్నం వైద్యుడు వద్దకు వెళ్లారు. తాను లంచ్‌కు వెళుతున్నానని చెప్పడంతో ఇంటి వద్ద చిన్నపిల్లలు ఉన్నారని, తాము ఇంటికి వెళ్లాలని మందులు రాయమని బతిమిలాడుతుండగా ఆవేశానికి లోనైనా వైద్యుడు తన తల్లి పరింగినిని నెట్టివేశాడు. దీంతో కిందపడిన ఆమె తలకు తీవ్ర గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు ఆమె కాలు కూడా విరిగిందని కుమారుడు చందు అంటున్నాడు.
చికిత్సకు తరలించిన వైద్యశాల సిబ్బంది
తీవ్ర గాయాలపాలైన పరింగినిని శ్యామల వైద్యశాల సిబ్బందే హుటాహుటీని చికిత్స కోసం స్థానికంగా మరో వైద్యశాలకు తరలించారు. తలకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయడంతో రక్తం గట్టట్టిందని, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పడంతో శ్యామల నర్సింగ్‌హోం సిబ్బందే ఆమెను అంబులెన్స్‌లో ఖమ్మం తీసుకెళ్లారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం సదరు రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కోదాడ పట్టణ సీఐ శంకర్‌నాయక్ సిబ్బందితో వైద్యశాల వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపు చేశాడు. ఈ మేరకు పరింగిని కుమారుడు చందు కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు.
కిందపడి తలకు గాయాలపాలైన రోగి
మెరుగైన చికిత్స కోసం ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలింపు
కోదాడలోని ఓ ప్రైవేట్
ఆసుపత్రిలో ఘటన
బాధిత మహిళ కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు


