మిర్యాలగూడ: 18 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మిర్యాలగూడ పట్టణంలోని పాత లలిత టాకీస్ వద్ద గల భాగ్యలక్ష్మీ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనానికి యజమాని కర్నాటి కృష్ణ శుక్రవారం తాళం వేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి 18 నెలల అద్దెతోపాటు కరెంట్ బిల్లు రూ.1.75 లక్షలతో కలిపి మొత్తం రూ.15లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని భవన యజమాని తెలిపాడు. పలుమార్లు ఈఎస్‌ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా, నిరసనగా నోటీసులు ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడకూడదనే మానవతా దృక్పథంతో ఈనెల 29 వరకు గడువు ఇస్తున్నామని, ఈలోగా బకాయిలు చెల్లించకుంటే ఈనెల 30 నుంచి భవనానికి శాశ్వతంగా తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఆస్పత్రి డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. ఆస్పత్రి కిరాయి బకాయిల అంశాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే భవన యజమానికి చెల్లింపులు పూర్తిచేస్తామని తెలిపారు. ఈ డిస్పెన్సరీ పరిధిలో సుమారు 45వేల మంది కార్మికులు వైద్యసేవలు పొందుతున్నారని, ప్రతిరోజూ 100 నుంచి 200 మంది వరకు రోగులు వైద్య పరీక్షల కోసం వస్తుంటారని పేర్కొన్నారు. కిరాయి బకాయిల సమస్యను త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


