2.80 లక్షల టన్నుల
దిగుబడి అంచనా..
సాక్షి, యాదాద్రి: వానాకాలం ధాన్యం కొనుగోలు సీజన్‌కు పౌర సరఫరాలు, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల అమలుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు ఈ నెల 29న సంబంధిత కొనుగోలు కేంద్రాల నిర్వహణ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 325 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉన్నా.. మూసీ ఆయకట్టులో మాత్రం దిగుబడి ఏమాత్రం తగ్గదని అధికారులు అంచనా వేశారు. మొత్తంగా 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా చర్యలు ప్రారంభించారు.
‘పీసీఎస్ ఏపీ’ యాప్‌తో పర్యవేక్షణ..
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పీసీఎస్ ఏపీ (ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ సెల్ఫ్ అసెస్‌మెంట్ పోర్టల్) యాప్ ద్వారా ఈసారి కొనుగోలు కేంద్రాల వసతులను పర్యవేక్షించనున్నారు. యాప్ ద్వారా ప్రతి కేంద్రాన్ని జియో–ట్యాగింగ్ చేసి విశ్లేషిస్తారు. రైతులకు అవసరమైన 16 రకాల సౌకర్యాలను పరిశీలించి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. కేంద్రంలో తాగునీరు, నీడ, విద్యుత్, టార్పాలిన్లు, గోనె సంచులు, తేమ కొలిచే యంత్రాలు, బరువు తూచే యంత్రాలు, సెక్యూరిటీ, రవాణా సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు ఉన్నాయో లేదో పరిశీలించి, ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వసతులను బట్టి గ్రేడింగ్..
యాప్‌లో అప్‌లోడ్ చేసిన సౌకర్యాల ఆధారంగా కొనుగోలు కేంద్రాలకు ఎల్–1 నుంచి ఎల్–5 వరకు గ్రేడింగ్ ఇస్తారు. సాధారణ కొనుగోలు కేంద్రాలు కనీసం ఎల్–3 గ్రేడ్ కలిగి ఉండాలి. వ్యవసాయ మార్కెట్ యార్డుల కేంద్రాలకు తప్పనిసరిగా అత్యున్నతమైన ఎల్–5 గ్రేడ్ (పూర్తి స్థాయి సౌకర్యాలు) ఉండాల్సిందే. పీసీఎస్ ఏపీ యాప్ ప్రక్రియను అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాతే కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ట్యాబ్‌లు ఓపెన్ అవుతాయని పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మెరుగైన వసతులుంటేనే నిధులు
కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించి గ్రేడింగ్ పెరిగితేనే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మార్కెట్ ఫీజు 1 శాతం నుంచి 2 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొనుగోలు కేంద్రాలకు అదనపు నిధులు సమకూరుతాయి.
ఈ వానాకాలం సీజన్‌లో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో దొడ్డు రకం సుమారు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, మూసీ ఆయకట్టు పరిధి నుంచే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా. దీంతోపాటు ఈ సీజన్‌లో రైతులు అధికంగా సాగు చేసే సన్న రకం ధాన్యం దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల వరకు వస్తుందని భావిస్తున్నారు. గత సీజన్ తరహాలోనే ప్రాథమికంగా 325 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల నాన్–ఆయకట్టులో సాగు తగ్గి, దిగుబడి కూడా కాస్త తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫ జిల్లాలో 325 కేంద్రాల ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు
ఫ 2.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
ఫ ఈసారి కొత్తగా ‘పీసీఎస్–ఏపీ’ యాప్‌తో పర్యవేక్షణ
ఫ 29న కొనుగోలు కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ


