సాఫ్ట్‌వేర్‌తో అనర్హులకు చెక్
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న చేయూత పింఛన్ల పథకంలో అర్హుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. గత ప్రభుత్వంలో ఆసరా దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోవడం, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం కల్పించడంతో జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు పోటెత్తాయి. పైరవీలకు తావులేకుండా, కేవలం అసలైన నిరుపేదలకే పింఛన్ లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం శ్రీ360 డిగ్రీల సమగ్ర సర్వేశ్రీను తీసుకువచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా క్షేత్రస్థాయి ఆస్తుల వివరాలను నిశితంగా పరిశీలిస్తోంది.
30వ తేదీ వరకు సర్వే
దసరా పండుగ కానుకగా లబ్ధిదారులకు కొత్త పింఛన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు పనుల్లో వేగం పెంచారు. వాస్తవానికి ఈ నెల 25 లోపు సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ప్రక్రియను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వే గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. తుది నివేదికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే అర్హుల జాబితాను విడుదల చేయనున్నారు.
వితంతు పింఛన్లే ఎక్కువ
జిల్లా వ్యాప్తంగా చేయూతకు మొత్తం 18,308 దరఖాస్తులు నమోదయ్యాయి. మొత్తం దరఖాస్తుల్లో ఎక్కువ వితంతు పింఛన్ల కోసమే రావడం గమనార్హం. వితంతు పింఛన్లు 8,478, దివ్యాంగుల పింఛన్లు 4,410, గీత కార్మికుల పింఛన్లు 2,930, చేనేత కార్మికుల పింఛన్లు 1,573, ఒంటరి మహిళల పింఛన్లు 917 చొప్పున నమోదయ్యాయి. ఇందులో వలిగొండ మండలం 1,438, మోత్కూరు రూరల్ 310, రామన్నపేట 1,338, భువనగిరి రూరల్ 1,220, చౌటుప్పల్ రూరల్ 1,206, భువనగిరి మున్సిపాలిటీ 1,178, నారాయణపూర్ 1,162, యాదగిరిగుట్ట రూరల్ 927, బీబీనగర్ 918, రాజాపేట 907, భూదాన్ పోచంపల్లి 775, ఆత్మకూరు (ఎం) 750, గుండాల 722, చౌటుప్పల్ మున్సిపాలిటీ 702, బొమ్మలరామారం 628, అడ్డగూడూరు 618, ఆలేరు రూరల్ 595, పోచంపల్లి మున్సిపాలిటీ 582, ఎం.తుర్కపల్లి 565, మోటకొండూరు 534, ఆలేరు మున్సిపాలిటీ 454, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 390, మోత్కూరు మున్సిపాలిటీ 389 చొప్పున దరఖాస్తులు అందాయి.
దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులను కచ్చితంగా అంచనా వేసేందుకు ‘360 డిగ్రీల సాఫ్ట్‌వేర్’ ను వినియోగిస్తున్నారు. విచారణ అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి జీవన ప్రమాణాలు, కుటుంబ నేపథ్యం, ఉపాధి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల పేరిట కార్లు గానీ, ఇతర వాణిజ్య వాహనాలు గానీ ఉంటే ఈ సాఫ్ట్‌వేర్ తక్షణమే గుర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ. 2 లక్షల పరిమితి దాటినట్లు తేలితే ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణలోనే తిరస్కరిస్తున్నారు.
ఫ అనర్హుల ఏరివేతకు అత్యాధునిక సాఫ్ట్‌వేర్ అస్త్రం
ఫ పకడ్బందీ సర్వే కోసం ఈ నెలాఖరు వరకు గడువు పెంపు


