మర్రిగూడ : విద్యార్థిని మౌనిక ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్ట్ చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు శుక్రవారం మర్రిగూడ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మండల పరిధిలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని వరికుప్పల మౌనిక ఈ నెల 2న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఇద్దరి వేధింపుల కారణంగానే మౌనిక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు. బాలిక రాసిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులకు అందజేశామని తెలిపారు. ఘటన జరిగిన రోజే మౌనిక తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేసినప్పటికీ, నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


