ఖాకీ కొలువుకు
పోలీస్ ఉద్యోగమే
లక్ష్యంగా శ్రమిస్తున్న యువత
ఫ మైదానాల్లో ప్రాక్టీస్
ఫ గ్రంథాలయాల్లో ప్రిపరేషన్
రామగిరి (నల్లగొండ): పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో అర్హులైన అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. నిరుద్యోగ యువత ఖాకీ చొక్కా ధరించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు.
అభ్యర్థులతో నిండిపోతున్న లైబ్రరీలు
యువతీ యువకులు నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఆవరణతోపాటు, క్రీడా మైదానాలకు వేకువజామునే వచ్చి రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకుంటూ ఫిజికల్ ఈవెంట్లలో అత్యుత్తమ మార్కులు సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లా కేంద్ర గ్రంథాలయం, ప్రైవేట్ స్టడీ హాళ్లు, కోచింగ్ సెంటర్లు అభ్యర్థులతో నిండిపోతున్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతూ అభ్యర్థులు గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
వయోపరిమితి పెంపుతో..
పోలీసు నియామకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది అభ్యర్థులకు ఊరటనిచ్చింది. గతంలో ఎస్సై ఉద్యోగాలకు వయోపరిమితి 32 ఏళ్లు, కానిస్టేబుళ్లకు 29 ఏళ్లుగా ఉండేది. ఈ వ్యత్యాసంపై అభ్యంతరాలు రావడంతో స్పందించిన ప్రభుత్వం కానిస్టేబుల్ పోస్టులకు కూడా వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ జీవో విడుదల చేసింది. ఈ సడలింపు సివిల్, ఏఆర్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు వర్తిస్తుంది. దీంతో చివరి అవకాశంగా భావిస్తున్న వందలాది మంది సీనియర్ అభ్యర్థులకు మళ్లీ ఆశలు చిగురించాయి.


