పెరిగిన యాదగిరీశుడి హుండీ ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన యాదగిరీశుడి హుండీ ఆదాయం

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

యాదగిరిగుట్ట: శ్రావణ మాసంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధికంగా తరలివచ్చారు. దీంతో శ్రీస్వామి వారికి ఈ మాసంలో రూ.12,69, 50,890 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇక గతేడాది శ్రావణ మాసంలో రూ.10,27, 06,792 ఆదాయం రాగా.. ఈఏడాది రూ.2, 42,44,098 అధికంగా వచ్చినట్లు తెలిపారు. శ్రావణ మాసంలో వచ్చిన నాలుగు ఆదివారాలతో పాటు వరలక్ష్మీ వ్రతం, ప్రత్యేక సెలవు రోజుల్లో, స్వాతి నక్షత్రం రోజుల్లో భక్తులు శ్రీస్వామిని అధికంగా దర్శించుకున్నట్లు ఆలయాధికారులు పేర్కొన్నారు.

రంగాపురం ఉపాధ్యాయుడికి అంతర్జాతీయ గుర్తింపు

గరిడేపల్లి: జపాన్‌లో జరిగిన అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనలో గరిడేపల్లి మండలంలోని రంగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు చారుగుండ్ల రాజశేఖర్‌ ఉత్తమ పరిశోధనా పత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. సెప్టెంబర్‌ 5 నుంచి 12 వరకు జరిగిన ఈ పర్యటనలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ నేతృత్వంలో తెలంగాణ నుంచి 29 మంది ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు పాల్గొన్నారు. జపాన్‌లోని ప్రముఖ విద్యాసంస్థలను సందర్శించిన ఈ బృందం.. రోబోటిక్స్‌, సాంకేతిక విద్య, ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి, సీడబ్ల్యూఎస్‌ఎన్‌ బోధనా పద్ధతులపై అధ్యయనం చేసింది. ఈ వేదికపై రాజశేఖర్‌ సమర్పించిన పరిశోధనా పత్రానికి విశేష స్పందన లభించింది. ఆయన ప్రతిభను అభినందిస్తూ జపాన్‌ విద్యాశాఖ సంచాలకులు డాక్టర్‌ ఆఖావో చేతుల మీదుగా రాజశేఖర్‌ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రత్యేకంగా అభినందించారు.

జాతీయ స్థాయి ‘ప్రేరణ’కు కల్మల్‌ చెరువు విద్యార్థి

గరిడేపల్లి: సూర్యాపేట జిల్లా విద్యా రంగానికి సంబంధించి కల్మల్‌ చెరువు విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. గరిడేపల్లి మండలం కల్మల్‌ చెరువు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి గుండెబోయిన శ్రీరామ్‌.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి శ్రీప్రేరణశ్రీ (అనుభవాత్మక విద్యా కార్యక్రమం)కు ఎంపికయ్యాడు. 2025 నవంబర్‌లో జవహర్‌ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రేరణ ఉత్సవ్‌లో శ్రీరామ్‌ తన సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ప్రతిభతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి అర్హత సాధించినట్లు జిల్లా నోడల్‌ నవోదయ ప్రిన్సిపాల్‌ ఆదినారాయణ ప్రకటించారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఉన్న ‘ది వెర్నాక్యులర్‌ స్కూల్‌’లో (ప్రధాని మోదీ చదివిన పాఠశాల) 2026 నవంబర్‌ 15 నుంచి 21 వరకు జరిగే రెసిడెన్షియల్‌ శిక్షణలో శ్రీరామ్‌ పాల్గొననున్నాడు.

13 మంది

యువకుల బైండోవర్‌

హుజూర్‌నగర్‌ : వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ గురించి జరిగిన గొడవలో ఇరువర్గాలకు చెందిన 13 మంది యువకులను బైండోవర్‌ చేసినట్లు ఎస్‌ఐ నరేష్‌ శుక్రవారం తెలిపారు. హుజూర్‌నగర్‌లోని పీర్లకొట్టం వద్ద నిమ్మతోట బజారులో ఇరువర్గాలకు చెందిన 13మంది యువకుల మధ్య ఉత్సవ నిర్వహణపై గొడవ జరిగింది. దీంతో వారిని స్థానిక తహసీల్దార్‌ సమక్షంలో వారిని బైండోవర్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement