పెసర, మినుము సాగుకు అనువైన సమయమిదే.. | - | Sakshi
Sakshi News home page

పెసర, మినుము సాగుకు అనువైన సమయమిదే..

Sep 12 2026 12:42 AM | Updated on Sep 12 2026 12:42 AM

సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడి

గరిడేపల్లి: యాసంగి సీజన్‌లో పెసర, మినుము పంటలను సాగు చేసేందుకు ప్రస్తుతం అనువైన సమయమని కేవీకే గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త అరిగెల కిరణ్‌కుమార్‌ తెలి పారు. తేమను నిల్వ ఉంచే అన్ని రకాల భూముల్లో పెసర సాగు చేసుకోవచ్చని, మినుము సాగుకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలమని, చౌడు నేలలు, మురుగు నీరు నిలిచే భూములు ఈ పంటల సాగుకు అనుకూలం కాదని పేర్కొన్నారు. పెసర, మినుము సాగులో రైతులు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, విత్తనశుద్ధిపై పలు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.

సెప్టెంబర్‌ 15 నుంచి విత్తుకోవచ్చు

యాసంగిలో పెసర, మినుము పంటలను సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ వరకు విత్తుకోవచ్చు. పెసరలో డబ్ల్యూజీజీ– 42 (యాదాద్రి), ఎంజీజీ– 295, డబ్ల్యూఆర్‌జీ– 37 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇవి 60 నుంచి 65 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి ఎకరానికి సుమారు 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మినుములో మధిర మినుము–01 (ఎంబీజీ–1070), ఎల్‌బీజీ–752, ఎల్‌బీజీ– 20, ఎంబీజీ– 207, పీయూ–31 రకాలను సాగు చేసుకోవచ్చు. ఈ రకాలు 70 నుంచి 85 రోజుల పంటకాలాన్ని కలిగి ఉండి ఎకరానికి 4 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది.

విత్తనశుద్ధితో పురుగుల నివారణ

ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేయడం ద్వారా సుమారు 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల నుంచి పంటను రక్షించుకోవచ్చు. పొలంలో మొదటిసారిగా ఈ పంటలను సాగు చేస్తున్న రైతులు విత్తనాలకు రైజోబియం కల్చర్‌ను పట్టించాలి. ఎకరాకు అవసరమైన విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్‌ను బాగా కలిపి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ముందుగా శిలీంధ్రనాశక మందుతో విత్తనశుద్ధి చేసి, ఆరబెట్టిన తర్వాతే రైజోబియం కల్చర్‌ను విత్తనాలకు పట్టించాలి.

రైతులు పంట సాగులో సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించాలి. సరైన సమయంలో విత్తడం, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, విత్తనశుద్ధి చేయడం, అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పంటలో చీడపీడలను సమర్థంగా నియంత్రించి అధిక దిగుబడులు పొందవచ్చు.

ఫ పంట సాగులో విత్తనశుద్ధి, సస్యరక్షణ చర్యలపై కేవీకే శాస్త్రవేత్త సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement