సాక్షి యాదాద్రి : తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైస్ ఇండస్ట్రీని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పసుపునూరి నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు మార్త వెంకటేశం డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లర్లను దోషులుగా చిత్రీకరించే ప్రక్రియను మానుకోవాలన్నారు. ఉడకబెట్టిన బియ్యం లక్ష్యాన్ని కేటాయించకపోవడం, ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వకు స్థలం కొరత ఏర్పడటం వల్ల ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో రబీ 2025–26 నాటి మిగులు ధాన్యాన్ని వెంటనే బహిరంగ మార్కెట్లో విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గత పంటలకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలు పూర్తయ్యే దాకా మిల్లులకు కొత్త ధాన్యాన్ని కేటాయించవద్దన్నారు.మిల్లుల్లో సార్టెక్స్ శుద్ధి ప్రక్రియలో నష్టం, అధిక నూకలు ఏర్పడటం, అకాల వర్షాలు, నిల్వల్లో సహజంగా తేమ తగ్గడం, నాణ్యత క్షీణత తదితర కారణాల వల్ల 18 నుంచి 20 శాతం వరకు ధాన్యం నష్టం తప్పడం లేదని వారు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల సమయంలో అధికారులు ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పెరిగిన విద్యుత్, కార్మిక, యంత్రాల నిర్వహణ ఖర్చుల దృష్ట్యా మిల్లింగ్ చార్జీలను క్వింటాకు రూ. 150 చొప్పున పెంచి చెల్లించాలని కోరారు. డీఎస్‌ఓ రోజారాణి, కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డిలకు మిల్లర్ల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా వెంకటరమణ, ఇల్లెందుల మల్లేష్, మంచుకంటి భాస్కర్, పసుపునూరి మనోహర్, వలిగొండ అశోక్, మోత్కూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ పెండింగ్ సీఎంఆర్ ఇచ్చాకే కొత్త ధాన్యం కేటాయించాలి
ఫ మిల్లింగ్ చార్జీలు క్వింటాకు రూ. 150కి పెంచాలి
ఫ మిల్లర్స్ అసోసియేషన్
ప్రతినిధుల డిమాండ్


