సాక్షి, యాదాద్రి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) ద్వారా మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా యంత్రాంగం నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణతో పాటు ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ భాగస్వామ్యంతో రెండు మోడల్స్‌లో శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటిది టాస్క్ ట్రైనర్ల ద్వారా నేరుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడం. రెండోది ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఉద్యోగాధారిత శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.
శిక్షణ అంశాలు ఏమిటంటే..
ఏఐ , మెషిన్ లెర్నింగ్, పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, యానిమేషన్స్ వంటి ఐటీ, సాంకేతిక కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. వైఎస్కే ఇన్ఫోటెక్, టెలిపెర్ఫార్మెన్స్, మైండ్ ప్లస్ వంటి కంపెనీలు ఫ్రెషర్లకు 15 నుంచి 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇందులో ప్రతిభ చూపిన వారికి రూ. 1.8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా భువనగిరి, చౌటుప్పల్, రామన్నపేట, మోత్కూర్ వంటి ప్రాంతాల్లోనూ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఐటీ రంగానికే పరిమితం కాకుండా రీటైల్ సేల్స్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ సహకారంతో భువనగిరిలోని లైబ్రరీ ప్రాంగణంలో బ్యాంకింగ్, ఎస్‌ఎస్సీ, ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ వంటి పోటీ పరీక్షలన్నింటికీ ఉపయోగపడేలా 8 నెలల శిక్షణ తరగతులు నిర్వహిస్తారన్నారు.
వచ్చేవారం శిక్షణ తరగతులు ప్రారంభం
శిక్షణకు ఇప్పటికే 46 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి కోర్సుకు కనిష్టంగా 50 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. వచ్చే వారంలో శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. మహిళలు, దివ్యాంగులకు రవాణా సౌకర్యవంతంగా ఉండి, కంప్యూటర్ ల్యాబ్ వసతి ఉన్న వేదికను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ట్రెయినీ డెప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ నాయక్ పాల్గొన్నారు.
ఫ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో శిక్షణ
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడి


