చిట్యాల : ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ అస్వస్థతకు గురై మృతి చెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం ఎలికట్టె గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలికట్టె గ్రామానికి చెందిన గొలనుకొండ లింగయ్య(59) ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన ఫాం పాండ్ పనులు చేస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కూలీలు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
నిజాయితీ చాటుకున్న కరాటే మాస్టర్
హాలియా : ఏటీఎంలో మరొకరు మర్చిపోయిన నగదును తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఓ కరాటే మాస్టర్. హాలియాలోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ నెల 6న సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి రూ.43,000 నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చారు. ఏటీఎంలో నగదు డిపాజిట్ అయిందని భావించిన ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఆ నగదు ఏటీఎం నుంచి తిరిగి బయటకు వచ్చింది. ఆ సమయంలో ఆయన వెనుకనే ఉన్న కరాటే మాస్టర్ తంగేళ్ల సత్యనారాయణరాజు ఆ డబ్బును గమనించారు. ఆ రూ.43000 నగదును భద్రంగా తనవద్దే ఉంచుకుని.. బుధవారం ఎస్‌బీఐ మేనేజర్ లావూరి మోహన్‌నాయక్ సమక్షంలో సంబంధిత వ్యక్తికి అందజేశారు. సత్యనారాయణరాజు నిజాయితీని బ్యాంకు మేనేజర్ లావూరి మోహన్‌నాయక్ అభినందించారు.
ఏఐటీయూసీ రాష్ట్ర
కార్యదర్శిగా ఎం.డీ ఇమ్రాన్
భువనగిరిటౌన్ : కరీంనగర్‌లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల్లో భువనగిరికి చెందిన ఎం.డీ ఇమ్రాన్ రెండోసారి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇమ్రాన్ ఎంపిక పట్ల స్థానిక కార్మిక వర్గాలు, ఏఐటీయూసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
అప్పుల బాధతో
కౌలు రైతు ఆత్మహత్య
చండూరు : అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చండూరు మండలం బోడంగిపర్తిలో బుధవారం జరిగింది. బోడంగిపర్తి గ్రామానికి చెందిన మహ్మద్ జానీ(42) తనకున్న అర ఎకరంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడంతో పంట పూర్తిగా వాడుపట్టి ఎండుతుందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గతేడాది, ఈసారి కలిసి రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది కూడా పంట చేతికి రాదని గ్రహించిన ఆయన అప్పులు కట్టే మార్గం లేక బుధవారం సాయంత్రం వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటోలో జానీని మునుగోడు ఆస్పత్రికి.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
బైక్, ఆటో ఢీ.. ఒకరు మృతి
మేళ్లచెరువు : బైక్, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చింతలపాలెం మండలం శోభనాద్రిపురం పరిధిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభనాద్రిగూడెం గ్రామానికి చెందిన ఆకారపు సత్యనారాయణ(35) మేళ్లచెరువులో నివాసముంటూ స్థానికంగా ఓ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. బుధవారం తన అత్తగారి ఊరైన చింత్రియాలకు వెళ్లి తిరిగి వస్తుండగా.. శోభనాద్రిగూడెం గ్రామ పరిధిలోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న గోతినితప్పించబోయి ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పరమేష్ తెలిపారు. మృతుడికి భార్య ఉంది.


