చౌటుప్పల్, చిట్యాల : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి వెంబడి చౌటుప్పల్, చిట్యాల పరిధిలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్. శివశంకర్‌రెడ్డి, జిల్లా డిజిగ్నేటెడ్ ఆఫీసర్ పి. స్వాతి తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు.
కుళ్లిన మాంసం.. ఆహార పదార్ధాలు..
చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేటలోని చాచా దాబాలో కుళ్లిన మాంసం నిల్వలను అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నేలపై పడేయడం, సింథటిక్ కలర్స్ వినియోగించడం, ఫ్రిజ్‌లలో ఫంగస్, పరిసరాలలో మురికి పేరుకుపోవడాన్ని గుర్తించి దాబాను సీజ్ చేసి, లైసెన్స్ సస్పెండ్ చేశారు. కుళ్లిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేయడంతో పాటు శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.అదేవిధంగా మల్కాపురంలోని సంగం హోటల్‌లోనూ ఫంగస్ సోకిన కూరగాయలు, ఉష్ణోగ్రత నియంత్రణ లేని ఫ్రిజ్‌లు, కుళ్లిపోయిన మాంసం, కూరగాయలను గుర్తించి ధ్వంసం చేశారు. చిట్యాల పట్టణంలోని బ్లూఫాక్స్ మినర్వా కేఫ్‌లో ఆహార పదార్థాలను సక్రమంగా నిల్వ చేయకపోవటం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంట గదిలో పరిశుభ్రత లోపించడం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు 55 కిలోల నాణ్యత లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే ధ్వంసం చేసి నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆహార పదార్థాలకు సంబంధించిన ఆరు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు :
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి
నాసిరకం ఆహార పదార్థాలతో వ్యాపారం చేయడం ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ ఫుట్ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార తయారీలో నాణ్యతతో పాటు పరిశుభ్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని, మాంసాన్ని నిల్వ చేసి తిరిగి మరుసటి రోజు వాడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఫ హైదరాబాద్–విజయవాడ హైవేపై
గల హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలలో లోపాలను గుర్తించిన అధికారులు
ఫ పలు హోటళ్ల సీజ్, నోటీసులు జారీ


