భువనగిరి (బీబీనగర్) : మానసిక సమస్యలపై సమాజంలో ఉన్న అపోహలను నిరంతరం చర్చించడం ద్వారానే తొలగించవచ్చని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అమితా అగర్వాల్ అన్నారు. బుధవారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన ఆత్మహత్యల నివారణ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మానసిక ఒత్తిడి, తీవ్ర కుంగుబాటుకు గురైన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్న వారిని ముందస్తుగానే గుర్తించేలా ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులకు ‘గేట్ కీపర్ ట్రైనింగ్’ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం ‘వాల్ ఆఫ్ హోప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన నాటిక ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర లక్కిరెడ్డితో పాటు పలువురు వైద్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫ బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్
అమితా అగర్వాల్


