నకిరేకల్ : రాష్టంలో కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం రాత్రి ఆయన నకిరేకల్‌లో విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుతూ చావు డప్పు కొట్టించి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడం చూస్తే సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ కనుసన్నల్లోనే ఈ తతంగం జరిగిందని అనిపిస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో ఉండి కూడా అనేక సందర్భాల్లో బండబూతులు మాట్లాడతున్నారని అన్నారు. కేసీఆర్ చావును కోరడం ఎంతవరకు సమంజసమన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే అని గుర్తుంచుకోవాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. వీరందరు కూడా కేసీఆర్ రాజకీయ భిక్షతో వచ్చి ఆయనపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన 1000 రోజుల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని, బీఆర్‌ఎస్ శ్రేణులు వెళ్లి ఆయన ఇంటి ముందు చావు డప్పు కొట్టలేమా అని ప్రశ్నించారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టకుండా అసెంబ్లీని సజావుగా నడపాలని కోరారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య


