మాకు మగ్గమే జీవనాధారం. మగ్గం నేయగా వచ్చిన ఆదాయం నుంచి భార్యాభర్తలిద్దరం ప్రతినెలా 2,400 త్రిఫ్ట్ కట్టుకుంటున్నాం. ప్రభుత్వం నెలకు రెండింతలు డబ్బులు జమ చేయాలి. కానీ రెండు నెలలు మాత్రమే వేసింది. గత సంవత్సరం జూన్ నుంచి డబ్బులు పడలేదు. వెంటనే బకాయి మొత్తాన్ని జమ చేసి మమ్మల్ని ఆదుకోవాలి.
– మంగళపల్లి శ్రీహరి,
చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి
ప్రభుత్వం మే నెల వరకు చేనేత కార్మికుల ఆర్‌డీ–2 ఖాతాలో డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం నెలనెలా జమచేయకపోయినా కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆలస్యమైనా ప్రభుత్వం ఒకేసారి డబ్బులను జమ చేస్తుంది. కార్మికులు మాత్రం క్రమం తప్పకుండా నెలనెలా పొదుపు డబ్బులు కట్టుకోవాలి.
– శ్రీనివాస్‌రావు, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ
భూదాన్‌పోచంపల్లి: చేనేత వృత్తిపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్న నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న త్రిఫ్ట్ (పొదుపు) పథకం లక్ష్యం నీరుగారుతోంది. కార్మికులు క్రమం తప్పకుండా తమ వాటా చెల్లిస్తున్నా, ప్రభుత్వం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ 15 నెలలుగా ఖాతాల్లో జమ కాకపోవడంతో ఏకంగా రూ.32.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో చేనేత కార్మికులకు ఈ పథకం నామమాత్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10,690 మంది కార్మికులు
చేనేత ప్రభావిత మండలాలు, గ్రామాలలో త్రిఫ్ట్ పథకంపై అధికారులు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,690 మంది మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు ఈ పథకంలో చేరారు. ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ 15 నెలలుగా ప్రభుత్వ వాటా కింద చేనేత కార్మికుల ఆర్‌డీ–2 అకౌంట్‌లో జమచేయాల్సిన డబ్బులను చెల్లించలేదు.
పథకం అమలు ఇలా..
చేనేత కార్మికులు తమ ఆదాయం నుంచి 8 శాతం వాటాను రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ అకౌంట్–1)లో జమచేస్తే, ప్రభుత్వం ఆ మొత్తానికి రెండింతలు అనగా 16 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఆర్‌డీ–2 అకౌంట్‌లో జమ చేస్తుంది. గరిష్టంగా నెలకు రూ. 1200 (అనుబంధ కార్మికుడైతే రూ. 800) బ్యాంకులో జమచేసుకోవచ్చు.
పవర్‌లూమ్ కార్మికులకు ప్రభుత్వం సమాన వాటా (1:1) ఇస్తుంది. కార్మికుడు గరిష్టంగా నెలకు రూ. 1000 (అనుబంధ కార్మికుడు రూ. 600) జమచేస్తే, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని ఆర్‌డీ–2లో జమ చేస్తుంది.రెండేళ్ల అనంతరం జమ అయిన మొత్తం డబ్బును కార్మికుడు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
మరో 6 నెలల్లో ముగియనున్న పథకం
రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ పథకం మెచ్యూరిటీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. గత సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం 2026 మార్చితో ముగుస్తుంది. మరో ఆరు నెలల్లో పథకం ముగుస్తుండటంతో నేతన్నల్లో ఆందోళన మొదలైంది. జిల్లా వ్యాప్తంగా కార్మికులు తమ వాటా కింద ప్రతినెలా రూ.కోటి 85 లక్షలు జమ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తన వాటా కింద నెలకు రూ.2.17 కోట్ల చొప్పున జమ చేయాల్సి ఉండగా, గత సంవత్సరం జూన్ నెల నుంచి ఆ నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఫ 15 నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ వాటా నిధులు
ఫ జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన రూ.32.55 కోట్ల బకాయిలు
ఫ మరో ఆరు నెలల్లో ముగియనున్న పథకం గడువు
ఫ ఆందోళనలో 10 వేల మందికి పైగా చేనేత కార్మికులు


