సాక్షి, యాదాద్రి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం శాసనసభలోని సీఎం పేషీలో కలిశారు. ఆలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు 15వ ప్యాకేజీ కాలువ తవ్వకం పనుల రాజాపేట మండలం జాలసింగారం వరకు వేగవంతం పూర్తిచేయాలని కోరారు. రూ.45 కోట్లతో చేపట్టే ఈ పనుల ద్వారా దాదాపు 100 చెరువులను నింపడంతో పాటు 7,200 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని సీఎంకు వివరించారు. ప్రధాన రహదారులకు అనుసంధానంగా గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులకు రూ.5కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన ఐలయ్య ఆలేరు మండలం కొలనుపాకలోని సోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించాల్సిందిగా కోరగా మంత్రి విడుదల చేసినట్టు ఐలయ్య పేర్కొన్నారు.
ఫ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విజ్ఞప్తి


