గుండాల మండలం బండ కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 35 మంది విద్యార్థులు ఉండగా ఈ విద్యా సంవత్సరం 94 మంది అయ్యారు. ప్రభుత్వం నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుండడంతో తల్లిదండ్రులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలవైపు మొగ్గు చూపారు. గ్రామానికి చెందిన బొబ్బిలి రాజశేఖర్ రెడ్డి గత విద్యా సంవత్సరం2025–26లో తన ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం 2026–2027వారిని గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు.
ఉపాధ్యాయుల కొరత రాకుండా చూస్తున్నాం
బొమ్మలరామారం మండలం రాముని తండా ప్రాథమిక పాఠశాల 2022– 24 వరకు మూతపడి ఉంది. ఏకోపాధ్యాయురాలు నీలం శ్రీదేవి ఈ పాఠశాలకు పునరుజ్జీవం పోశారు. 2024– 25లో తండాలోని ప్రతి ఇంటికి తిరిగి 27 మంది విద్యార్థులతో పాఠశాలను పునః ప్రారంభించారు. 2025– 25లో విద్యార్థుల సంఖ్య 30కి చేరుకుంది. పాఠశాలలోని కిచెన్ గార్డెన్‌లోని ఆర్గానిక్ కూరగాలతో పాటు సన్నబియ్యంతో మధ్యాహ్నం రుచికరమైన భోజనం వండిపెట్టడం ద్వారా విద్యార్థులను పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తున్నారు.
సాక్షి యాదాద్రి: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు విద్యాశాఖ పకడ్బందీ కార్యాచరణను అమలు చేస్తోంది. సర్కారు కల్పిస్తున్న మౌలిక వసతులు, బ్రేక్‌ఫాస్ట్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల నిబద్ధతతో.. మూతబడిన స్కూళ్లు సైతం తెరుచుకుని నడుస్తున్నాయి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లాలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక కథనం.
ఉపాధ్యాయుల సర్దుబాటు
ఏ ఒక్క విద్యార్థీ చదువులో వెనుకబడకూడదన్న సంకల్పంతో విద్యాశాఖ సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. పది నుంచి ఇరవై వరకు విద్యార్థులున్న పాఠశాలలకు అదనంగా మరో ఉపాధ్యాయుడిని కేటాయించారు. పది లోపు విద్యార్థులున్న ఏకోపాధ్యాయ బడుల్లో టీచర్ అత్యవసర సెలవు పెడితే, సీఆర్పీలతో నడిపిస్తున్నారు.
డ్రాపౌట్స్‌కు చెక్..
బడి ఈడు పిల్లలు బడి బయట ఉండకుండా చూడటమే లక్ష్యంగా వేసవిలో నిర్వహించిన ప్రత్యేక సర్వే సత్ఫలితాలనిచ్చింది. బడి మానేసిన పిల్లలను వయస్సును బట్టి సాధారణ విద్యా స్రవంతిలోకి తీసుకొచ్చారు. బాలికలను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ), బాలురను స్థానిక జెడ్పీ, గురుకుల, వసతి గృహ పాఠశాలల్లో చేర్పించడంతో జిల్లాలో బడి మానేసే వారి శాతం గణనీయంగా తగ్గింది.
పునాది అభ్యసన బలోపేతానికి..
పునాది అభ్యసనం బలోపేతానికి ఎంపిక చేసిన 150 సముదాయ పాఠశాలల్లో ప్రత్యేక పరిశీలన బృందాలు తరగతులను నిశితంగా పరిశీలిస్తున్నాయి. అభ్యాస దీపికలు, సూచిక పుస్తకాలు, నల్లబల్ల సాధనతో పాటు ఉపాధ్యాయులు స్వయంగా పిల్లల పక్కన కూర్చుని అక్షరాలు దిద్దించడం, పదాలు చదివించడం చేస్తున్నారు. లెక్కల్లో కూడికలు, తీసివేతలపై పట్టు సాధించేలా విద్యార్థులను దత్తత తీసుకుని వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు.
అక్షరాస్యత సాధనలో సవాళ్లు..
జిల్లాలో అక్షరాస్యత 65.53శాతం ఉండగా ఇందులో స్త్రీల అక్షరాస్యత 55.02శాతంగా ఉంది. వందశాతం అక్షరాస్యత సాధనకు అడ్డంకిగా మారిన ప్రధాన సమస్యలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. బాలికల డ్రాపౌట్‌కు ప్రధాన కారణమైన బాల్యవివాహాలను అరికట్టి, అనాథ,పేద బాలికలను కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నారు. చౌటుప్పల్, మోత్కూర్, ఆలేరు, ఆత్మకూర్(ఎం), మోటకొండూరు ప్రాంతాల్లో పత్తి ఏరే పనులకు పిల్లలను తీసుకెళ్లే ధోరణిని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, మిల్లుల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక విద్యా ఏర్పాట్లు చేశారు.
ఫ రూపురేఖలు మారిన సర్కారు బడులు
ఫ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, ఉచిత పుస్తకాల పంపిణీ
ఫ బోధనకు ఆటంకం లేకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు
ఫ బడి మానేసిన వారిపై ప్రత్యేక దృష్టి
ఫ ప్రైవేట్ నుంచి సర్కారు బడిబాట పడుతున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలు 656
విద్యార్థుల సంఖ్య 39,447
బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నభోజనంతో 12 శాతం పెరిగిన హాజరు
డ్రాపౌట్స్ 3 శాతం కంటే తక్కువ
తండాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల బడులల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల అకడమిక్ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి లేదా సమీప బడుల నుంచి రొటేషన్ పద్ధతిలో టీచర్లను డిప్యుటేషన్‌పై పంపించాం. విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా బోధన అందిస్తున్నాం. అక్షరాస్యత శాతం పెంచడానికి కృషి చేస్తున్నాం.
– భిక్షపతి, డీఈఓ


