రాష్ట్రస్థాయికి చేరిన విచారణ
ఆలేరు: బాధితురాలి కిడ్నీ తొలగించిన ఘటనపై వైద్యాధికారులు, పోలీసులు ఉమ్మడిగా కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆలేరులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అర్పిత నర్సింగ్ హోంను సోమవారం రాత్రి అధికారులు సీజ్ చేశారు.
వైద్య సేవల నిలిపివేత – కేసు నమోదు
ఈ వ్యవహారంలో ఆలేరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ హోం నిర్వాహకుడు డాక్టర్ ప్రభాకర్‌తో పాటు శస్త్రచికిత్స నిర్వహించిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మహేష్‌పై కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలోని రెండు వార్డులను, కన్సల్టేషన్ గదిని డీఎంహెచ్‌ఓ మనోహర్, డీసీహెచ్‌ఎస్ సూర్యశ్రీ, తహసీల్దార్ ఆంజనేయులు సమక్షంలో తాళాలు వేసి సీజ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి కొత్త ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ నమోదు చేయకూడదని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులను వెంటనే డిశ్చార్జ్ చేసి ఇతర ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు.
అనుమతులపై ఆరా
కిడ్నీ వంటి కీలకమైన అవయవాలకు శస్త్రచికిత్స చేయడానికి అర్పిత నర్సింగ్ హోంకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన అనుమతులు, తగిన మౌలిక వసతులు, నిపుణులైన సిబ్బంది ఉన్నారా లేదా అనే అంశమే ప్రస్తుతం విచారణలో ప్రధానాంశంగా మారింది. అర్హత లేకుంటే ఇటువంటి ఆపరేషన్లు ఎలా నిర్వహించారనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
అనుమానాస్పద రీతిలో కిడ్నీ తొలగించిన తీరును రాష్ట్ర స్థాయి వైద్యాధికారులు తీవ్రంగా పరిగణించారు. స్థానిక అధికారులు సేకరించిన ప్రాథమిక ఆధారాలు, నివేదిక ఆధారంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలోని రాష్ట్రస్థాయి నిపుణుల బృందం తదుపరి విచారణను వేగవంతం చేయనుంది.
ఫ ఆలేరులోని అర్పిత నర్సింగ్ హోంలో వైద్య సేవల నిలిపివేత
ఫ ఇద్దరు డాక్టర్లపై కేసు నమోదు
ఫ అవయవ శస్త్రచికిత్సల అనుమతులపై అధికారుల ఆరా
ఫ డీఎంఈ పర్యవేక్షణలో రాష్ట్రస్థాయికి చేరిన విచారణ


