భువనగిరిటౌన్ : ప్రభుత్వ రికార్డుల్లో 15 ఏళ్ల క్రితమే పింఛన్ మంజూరైనట్లు చూపిస్తున్నా, ఆ నగదు ఇప్పటివరకు ఏ ఒక్క నెల కూడా తన చేతికి అందలేదని బాధితుడు రామగిరి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజావాణిలో ఆయన కలెక్టర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటూ వినతిపత్రం అందజేశారు.
విషయం ఏమిటంటే..
ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న రాంబాబు ఇటీవల కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లాడు. అక్కడ అధికారులు ఆయన ఆధార్ నంబర్ నమోదు చేయగా, ఇప్పటికే పింఛన్ మంజూరై అందుతున్నట్లు పోర్టల్‌లో స్పష్టంగా చూపించింది. పోర్టల్ వివరాల ప్రకారం 15 ఏళ్లుగా పింఛన్ మంజూరై ఉన్నప్పటికీ, వాస్తవానికి తనకు రూపాయి కూడా అందలేదని, ఈ విషయాన్ని తాను వారం రోజుల క్రితమే గుర్తించానని బాధితుడు వాపోయాడు. ఈ సమస్యపై మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే నేరుగా కలెక్టర్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపాడు. తన పేరిట రికార్డుల్లో జమ అవుతున్న పింఛన్ సొమ్ము ఇన్నాళ్లూ ఎవరి ఖాతాలోకి వెళ్తుందో అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని రామగిరి రాంబాబు కోరారు.


