శిథిలావస్థలో రంగనాథ రంగశాల | - | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో రంగనాథ రంగశాల

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లకు వినోదాన్ని అందించేందుకు హిల్‌కాలనీలో నిర్మించిన రంగనాథ రంగశాల నేడు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడిన ఈ ప్రాంగణం ప్రస్తుతం కంపచెట్లతో నిండిపోయి కనుమరుగయ్యే దుస్థితికి చేరింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ భవనాన్ని కాపాడి, ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

నాడు కళలకు కాణాచి

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాగర్‌లోని మూడు కాలనీల్లో సుమారు 30వేల మంది నివసించేవారు. చుట్టుపక్కల గ్రామాలు, తండాల ప్రజలు సైతం ప్రాజెక్టు పనుల్లో భాగస్వాములయ్యారు. వీరికి వినోదం కోసం ఏర్పాటు చేసిన ఈ రంగనాథ రంగశాల కళలకు కాణాచిగా పేరొందిందని పాతతరం వారు గుర్తు చేసుకుంటున్నారు. పౌరాణిక, సాంఘిక నాటకాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. అప్పటి ప్రముఖ నటీనటులు నూతనప్రసాద్‌, సావిత్రి, రేలంగి, జగ్గారావు, గిరిజ, రాజనాల తదితరులు ఇక్కడ నాటకాలు ప్రదర్శించారని చెబుతున్నారు. ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చిన ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు సైతం ఇక్కడి నాటకాలను వీక్షించి అబ్బురపడేవారు.

కంపచెట్ల మధ్య కనుమరుగు

సాగర్‌ కాలనీల్లో సినిమా థియేటర్ల రాకతో క్రమంగా రంగనాథ రంగశాలలో నాటకాల ప్రదర్శనలు తగ్గిపోయాయి. అనంతరం కొంతకాలం సభలు, సమావేశాలకు ఉపయోగించారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో సుమారు రూ.50 లక్షలు వెచ్చించి విద్యుత్‌ సౌకర్యం, ఫ్లోరింగ్‌, వాష్‌రూమ్‌లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సరైన నిర్వహణ లేకపోవడంతో రంగశాల ఆవరణ అంతా కంపచెట్లతో నిండిపోయింది. విద్యుత్‌ బోర్డులు, ఫ్యాన్లు అపహరణకు గురయ్యాయి. బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మినీ థియేటర్‌గా మారిస్తే..

గతంలో సాగర్‌ కాలనీల్లో మూడు సినిమా థియేటర్లు ఉండగా.. ప్రస్తుతం ఒక్కటి కూడా లేదు. దీంతో వినోదం కోసం స్థానికులు హాలియా, మాచర్ల, మిర్యాలగూడ వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రంగనాథ రంగశాలను అద్దెకు ఇచ్చి మినీ థియేటర్‌గా అభివృద్ధి చేస్తే.. ప్రజలకు వినోదం అందడంతో పాటు భవనానికి నిరంతర నిర్వహణ ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు. సాగునీటి శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.

ఫ నిర్వహణ లేక కనుమరుగవుతున్న నాగార్జునసాగర్‌లోని చారిత్రక వేదిక

ఫ ఒకప్పుడు ప్రముఖ నటీనటుల

నాటకాలతో కళకళ

ఫ ప్రస్తుతం కంపచెట్లు,

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

ఫ మినీ థియేటర్‌గా మార్చాలని

స్థానికుల విజ్ఞప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement