కారు ఢీకొని గేదె మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని గేదె మృతి

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

త్రిపురారం : కారు ఢీకొని గేదె మృతిచెందింది. ఈ ఘటన 165వ నంబర్‌ జాతీయ రహదారిపై త్రిపురారం గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండల కేంద్రానికి చెందిన వలసాని రమ్య, శ్రీను దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ సీజన్‌లో సాగు నీరు లేకపోవడంతో జీవనోపాధి నిమిత్తం గేదెను కొనుగోలు చేశారు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం గేదెను మేత కోసం పొలాల్లోకి తోలారు. రాత్రయినా గేదె ఇంటికి రాకపోవడంతో గేదెను వెతుక్కుంటూ వెళ్లేసరికి త్రిపురారం గ్రామ పరిధిలో సాగర్‌ రోడ్డుపై కారు ఢీకొని గేదె చనిపోయి కనిపించింది. మరికొన్ని రోజుల్లో ఈనడానికి సిద్ధంగా ఉన్న గేదె మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధిత రైతు రమ్య పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గేదెను రూ.1,30,000తో కొనుగోలు చేశామని, తాము జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నారు.

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తికి జైలుశిక్ష

రామగిరి(నల్లగొండ) : ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎన్‌. రోజారమణి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... కనగల్‌ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన బైరు గణేష్‌ ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి నిలదీయడంతో పెద్దలు ఒప్పుకోవడం లేదని చెప్పాడు. దీంతో ఆ యువతి 2020 నవంబర్‌ 11న కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్‌ఐ సతీష్‌రెడ్డి కేసు నమోదు చేయగా.. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి విచారణ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించిన జడ్జి ఎన్‌. రోజారమణి నిందితుడికి మూడేళ్లు జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ప్రభుత్వ ఉద్యోగం

ఇప్పిస్తానని మోసం

పంచాయతీ సెక్రటరీపై

ఎంపీడీఓకు ఫిర్యాదు

మేళ్లచెరువు : ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకొని మోసం చేసిన పంచాయతీ సెక్రటరీపై బాధితుడు సోమవారం గ్రీవెన్స్‌లో ఎంపీడీఓకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండలం పీక్లానాయక్‌ తండాకు అజ్మీర శ్రీనివాస్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ రూ.లక్ష తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా.. తన డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతుండడంతో పంచాయతీ సెక్రటరీపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

విద్యుదాఘాతంతో

మహిళ మృతి

త్రిపురారం : ఇంట్లో దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన త్రిపురారం మండలం రాజేంద్రనగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ గైకూరి నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ గ్రామ పంచాయతీకి చెందిన ఇస్లావత్‌ సేలి(52) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. రోజు మాదిరిగా సోమవారం ఇంట్లో దుస్తులు ఉతికి ఇనుప తీగపై ఆరేస్తుండగా.. కరెంట్‌ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఇంట్లో రేకుల కింద ఉన్న విద్యుత్‌ వైరుకు దుస్తులు ఆరేసే తీగ ఆనుకొని ఉండడంతో విద్యుత్‌ సరఫరా జరిగి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. ఆమె కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement