బాకీ డబ్బులు అడిగిన వృద్ధురాలిపై దాడి | - | Sakshi
Sakshi News home page

బాకీ డబ్బులు అడిగిన వృద్ధురాలిపై దాడి

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

నేలకొండపల్లి : బాకీ డబ్బులు తిరిగి చెల్లించాలని కోరిన వృద్ధురాలిపై దంపతులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి ధరావత్‌ బిచ్చు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని శంకరగిరి తండాకు చెందిన తేజావత్‌ చిట్టిబాబు–శామిని దంపతులకు రూ.12 వేలు అప్పుగా ఇచ్చింది. సోమవారం బిచ్చు శంకరగిరి తండాలోని తన కుమార్తె ఇంటికి వచ్చిన సందర్భంగా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని చిట్టిబాబు దంపతులను అడిగింది. దీంతో వారు తమకు డబ్బే ఇవ్వలేదంటూ వృద్ధురాలిపై దాడి చేశారు. ఈ మేరకు వృద్ధురాలి కుమార్తె శారద ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

విద్యుత్‌ స్తంభం ఎక్కి

యువకుడి హల్‌చల్‌

భువనగిరి(బీబీనగర్‌) : బిహార్‌ రాష్ట్రానికి చెందిన ధర్మేంర్‌ సోమవారం మద్యం మత్తులో బీబీనగర్‌ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్‌చల్‌ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి యువకుడిని కిందకు దింపి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

రైతు సోదరుల ఆత్మహత్యాయత్నం

తమ భూమిలో కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తుండటంతో ట్యాంక్‌ ఎక్కి ఆందోళన

మునగాల : తమకు వారసత్వంగా వస్తున్న సాగు భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించడాన్ని నిరసిస్తూ ఇద్దరు రైతు సోదరులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మునగాల మండలంలోని ముకుందాపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పందిరి సత్యనారాయణరెడ్డి, పందిరి పుల్లారెడ్డి సాధారణ మధ్య తరగతి రైతులు. వీరికి ఉన్న భూమిలో కొంత ఎన్‌ఎస్‌పీ కాలువ కింద పోగా, మిగిలిన భూమిలో సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నెల రోజుల క్రితం వారి భూమిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఈ క్రమంలో సోమవారం మండల ఆర్‌ఐ, ఆర్‌అండ్‌బీ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు కొందరు వార్డు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో భూమిలో ఉన్న గడ్డివాములను తొలగించారు. తమ భూమిలో భవనం నిర్మించవద్దని ఎంత వారించినా అధికారులు వినలేదని రైతులు వాపోయారు. కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేపట్టి తీరుతామని స్పష్టం చేయడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పక్కనే ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఉరేసుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వాటర్‌ ట్యాంక్‌ వద్దకు చేరుకుని, ఆ కుటుంబానికి అండగా ఉంటామని నచ్చజెప్పడంతో వారు కిందికి దిగివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement