యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం లక్ష పుష్పార్చన పూజలను అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి సుగ్రంధ పరిమళాలు వెదజల్లె రంగురంగుల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. తులసీ దళాలతో శ్రీస్వామి అమ్మవార్లను విశేషంగా పూజించారు. ఇక ఆలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య పూజలు విశేషంగా జరిపించారు. ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవలను వైభవంగా నిర్వహించారు.
శివాలయంలో విశేష పూజలు
యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. శ్రీస్వామి వారికి నిత్య పూజలు జరిపించి, మండపంలో నిత్య రుద్ర హవనం పూజను పూజారులు నిర్వహించారు. ఇక మహాశివుడికి అభిషేక, అర్చనలు జరిపించారు. శివ గర్భాలయంలో, ముఖ మండపంలోని స్పటిక లింగానికి పూజలు చేసి, హారతినిచ్చారు. సాయంత్రం ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల సేవోత్సవంలో భక్తులు పాల్గొన్నారు.


