నాగారం : సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం కూలీ పనులు చేసి కూడబెట్టిన డబ్బులను అప్పుగా ఇస్తే.. తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నాగారం మండలం పసునూర్ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పసునూర్ గ్రామానికి చెందిన పుట్టబంతి రాంబాబు, ఉమ(42) దంపతులకు నవీన్, ప్రభాస్ ఇద్దరు కుమారులు. భర్త రాంబాబు కొన్నేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోగా, ఉమ కూలీ పనులు చేసుకుంటూ కుమారులను పోషిస్తోంది. వీరికి సొంత ఇల్లు లేకపోవడంతో, ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో కూలీ పనులు చేస్తూ సుమారు రూ.5 లక్షల వరకు ఆదా చేసి, గ్రామంలోని పలువురికి అప్పుగా ఇచ్చింది. కాగా, ఇటీవల ఆమెకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి బేస్‌మెంట్ వరకు పూర్తి చేసింది. ఇంటి నిర్మాణానికి డబ్బులు అవసరం ఉండటంతో, తాను అప్పుగా ఇచ్చిన వారిని డబ్బులు తిరిగి ఇవ్వాలని ఉమ కోరింది. అయితే, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఇంటి నిర్మాణం బేస్‌మెంట్ దశలోనే నిలిచిపోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె అనారోగ్యం పాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం గుండెపోటుతో మృతి చెందింది. ఉమకు పుట్టింటి, అత్తింటి వైపు నుంచి ఎలాంటి బంధుగణం లేకపోవడంతో ఆమె ఇద్దరు కుమారులు అనాథలుగా మారారు. పెద్ద కుమారుడు నవీన్ ఇటీవల డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కుమారుడు ప్రభాస్ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. తల్లి మృతితో ఆ కుమారులు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అనంతరం సర్పంచ్, గ్రామస్తులు చందాలు సేకరించి ఉమ అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఫ సొంతింటి కోసం దాచుకున్న
రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చిన వైనం
ఫ తీసుకున్న డబ్బులు తిరిగి
ఇవ్వకుండా నిర్లక్ష్యంగా
వ్యవహరించిన రుణగ్రస్తులు
ఫ మనస్తాపంతో గుండెపోటుకు గురైన బాధితురాలు
ఫ అనాథలైన ఇద్దరు కుమారులు..
చందాలు సేకరించి అంత్యక్రియలు


