పెద్దవూర : అనారోగ్య కారణాలతో పెద్దవూర మండల మాజీ వైస్ ఎంపీపీ గోన వివేక్‌రావు(59) సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దవూర మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోన వివేక్‌రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివేక్‌రావు భార్య సుకన్య, కుమార్తె ఐశ్వర్య గత పదేళ్లుగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. వివేక్‌రావు మాత్రం తన తల్లి గోన యాదమ్మతో కలిసి స్వగ్రామంలోనే ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున వివేక్‌రావు పురుగుల మందు తాగి తన భార్య సుఖన్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తన బావగారైన విష్ణువర్ధన్‌రావుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. విష్ణువర్ధన్‌రావు పక్క ఇంటి వాళ్లకు సమాచారం అందించడంతో వాళ్లు వెళ్లేసరికి వివేక్‌రావు తన ఇంటి మిద్దైపె నుంచి దూకాడు. వివేక్‌రావును చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు.
పలువురు నివాళి..
వివేక్‌రావు భౌతికకాయానికి నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని వివేక్‌రావు పాడె మోశారు. అదేవిధంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి కూడా నివాళులర్పించారు.


