త్రిపురారం : ప్రత్యామ్నాయ పంటల సాగులో తక్కువ నీటితో రైతులకు 45 రోజుల్లో చేతికి వచ్చే పంట బెండ. సెప్టెంబర్ నెలలో సైతం బెండ సాగు చేపట్టి నికర ఆదాయం పొందవచ్చు. సరైన సాగు పద్ధతులు, సకాలంలో సస్యరక్షణ చర్యలు, పంటకు వైరస్ సోకిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు సూచనలు ఆమె మాటల్లోనే..
● భూమి తయారీ విధానం
ఎర్ర నేలలు, నీరు నిల్వ ఉండని నల్లరేగడి నేలలు బెండ సాగుకు అనుకూలం. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును చివరి దుక్కిలో 40 కేజీల సూపర్ పాస్పేట్, 10 కిలోల పొటాష్ వేసుకొని కలియ దున్నుకోవాలి. తయారైన ప్రధాన పొలంలో 6 అడుగులకు ఒక్క అడగు లోతు కాల్వను తీసుకోవాలి.
● విత్తనాల ఎంపిక
అర్కనామిక, పర్బని క్రాంతి, వరద నుర్వి రకాలు మన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. ఎకరానికి 3.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. విత్తే ముందు కిలోకు రెండు గ్రాముల కార్బండిజమ్, రెండు గ్రాముల థైరంతో శుద్ధి చేసుకోవాలి. సాళ్ల మధ్య 60 సెం.మీ., 30 సెం.మీ. దూరం ఉండాలి. గింజను ఎక్కువ లోతులో విత్తకుండా జాగ్రత్తపడాలి. లోతు ఎక్కువ అవ్వడం వల్ల నీరు నిలబడి గింజ కుళ్లిపోయే అవకాశం ఉంటుంది.
● నీరు, ఎరువుల యాజమాన్యం
బెండ సాగు చేయడానకి తక్కువ నీరు ఉన్నా సరిపోతుంది. క్రమం తప్పకుండా తేమ ఉండేలా చూసుకోవాలి. విత్తనం విత్తిన వెంటనే ఒక తడి, తర్వాత 7 నుంచి 8 రోజులకు పూత, కాయ దశలో 5 నుంచి 6 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఎక్కువ నీరు ఇవ్వకూడదు. అలా చేస్తే పూత రాలిపోతుంది. పూత మొదలైనప్పుడు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. పూత దశలో ఎకరాకు 55 గ్రాముల చిలేటెడ్ జింక్, 500 గ్రాముల బోరాన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత రాలడం తగ్గి కాయలు ఎక్కువగా వస్తాయి. నత్రజని ఎరువులు తక్కువగా వినియోగించాలి.
● కలుపు యాజమాన్యం
బెండ సాగు చేసిన 30 నుంచి 40 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20 నుంచి 40 రోజులకు రెండు సార్లు కలుపు తీయాలి. విత్తిన మూడు రోజుల్లో ఎకరాకు 80 మి.లీ. పెండీమిథలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే కలుపు రాదు.
తెగుళ్లు – నివారణ చర్యలు
1. పసుపు నరాల మొజాయిక్ తెగులు : ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకుల నరాలు పసుపు రంగులోకి మారి మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు ఎల్లోవీన్ మోసాయిక్ వైరస్ నిరోధక రకాలు వేయాలి. విత్తిన 10 రోజులకు ఒకసారి వేప నూనె పిచికారీ చేసుకోవాలి. తెగులు వచ్చిన మొక్కలను వంటనే పీకేయాలి.
2. బూడిద తెగులు : ఆకులపై తెల్లని పొడ ఉంటే 2 గ్రాముల సల్ఫర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
3. ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు వల్ల ఆకులపై గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు ప్రధాన పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పటికే తెగులు సోకిన మొక్కలు ఉన్నట్లయితే ఆకులను తొలగించి భూమిలో పూడ్చి వేయాలి.
4. వేరు కుళ్లు తెగులు : ఈ తెగులు వల్ల మొక్కల వేర్లు కుళ్లిపోతాయి. మొక్కలు వాడిపోతూ క్రమంగా ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మంచి విత్తనం ఎంచుకోవాలి. నీటి తడి ఇచ్చేటప్పుడు మంచి నీరు అందించాలి. పంట మార్పిడి పాటించడం ఉత్తమం.
పురుగులు – నివారణ చర్యలు
1. చెన్న పురుగు : ఈ పురుగులు మొక్కపై ఆకులను అంచుల నుంచి తినేస్తాయి. దీని నివారణకు ఎకరాకు 5 కిలోల వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే 2 మి.లీ. ఫ్రోఫినోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
2. ఫ్రూట్ బోరర్ : ఈ పురుగు పంట చేతికి వచ్చే సమయంలో కాయకు రంధ్రం చేసి కాయల్లోకి చొరబడి గుజ్జును తింటుంది. దీని నివారణకు గాను దెబ్బతిన్న కాయలను తుంచి పూడ్చి వేయాలి. తీవ్రత అధికంగా ఉంటేనే 2 మి.లీ. క్లోరాంగ్రానిలిప్రోల్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కోతకు 7 రోజుల ముందు ఏ రసాయనిక మందు పిచికారీ చేయరాదు.
కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం
ఉద్యానవన శాస్త్రవేత్త హిమబిందు సూచనలు


