విగ్రహాల తరలింపునకు విఘ్నాలు | - | Sakshi
Sakshi News home page

విగ్రహాల తరలింపునకు విఘ్నాలు

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

చిట్యాల : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికే రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. వినాయకచవితి ఉత్సవాల కోసం హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు భారీ విగ్రహాలను వాహనాల్లో తరలిస్తున్నారు. అయితే, హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులోని రైల్వే అండర్‌పాస్‌ వద్ద విగ్రహాల తరలింపునకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అండర్‌పాస్‌ ఎత్తు తక్కువగా ఉండటంతో.. వాహనాల్లో వస్తున్న భారీ విగ్రహాలు అండర్‌పాస్‌ దాటలేక గంటల తరబడి నిలిచిపోతుండటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం సుమారు ఐదారు గంటల పాటు పలు విగ్రహాలు అక్కడే నిలిచిపోయాయి.

భారీ ఎత్తుతో అవస్థలు..

ధూల్‌పేట నుంచి 15 నుంచి 20 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహాలను భారీ డీసీఎంల్లో ఏపీకి రవాణా చేస్తున్నారు. చిట్యాల రైల్వే అండర్‌పాస్‌ వద్దకు రాగానే ఎత్తు సరిపోక ఇరుక్కుపోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని విగ్రహాలు పైకప్పుకు తగిలి ధ్వంసమవుతున్నాయి. దీంతో చేసేది లేక వాహనాలపై ఉన్న విగ్రహాలను భారీ క్రేన్ల సహాయంతో కిందకు దించి, నేలపై చక్రాలతో నడిచే ట్రాలీపై ఉంచి తాళ్లతో లాగుతూ నెమ్మదిగా అండర్‌పాస్‌ దాటిస్తున్నారు. కొందరు నిర్వాహకులు విగ్రహాల ఎత్తు తగ్గించేందుకు ఏకంగా వినాయకుడి తల భాగంలో కిరీటం కొంత కట్‌ చేసి తరలించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైవేపై ట్రాఫిక్‌ జామ్‌..

విగ్రహాలను అతికష్టం మీద బయటకు తీసే క్రమంలో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండటంతో వాహనదారులు, ఉత్సవ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఇష్టంగా, భారీ ఖర్చుతో తయారు చేయించిన విగ్రహాలు అండర్‌పాస్‌ వద్ద ధ్వంసమవుతుండటంతో నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో విగ్రహాల రవాణా మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. భారీ విగ్రహాల తరలింపునకు అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చిట్యాల రైల్వే అండర్‌పాస్‌ వద్ద

నిలిచిపోతున్న భారీ విగ్రహాలు

ఎత్తు ఎక్కువగా ఉండటంతో

గంటల తరబడి అవస్థలు

కొన్నిసార్లు ధ్వంసమవుతున్న ప్రతిమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement