ప్రణయ్‌రాజ్‌.. ప్రపంచ రికార్డు | - | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌రాజ్‌.. ప్రపంచ రికార్డు

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

మోత్కూరు : ఉచిత సమాచార విజ్ఞాన వ్యాప్తిలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన తెలుగు వికీపీడియన్‌ ప్రణయ్‌రాజ్‌ వంగరి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించారు. వరుసగా పదేళ్ల పాటు ప్రతిరోజూ కనీసం ఒక వికీపీడియా వ్యాసాన్ని రాస్తూ 3,652 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ క్రమంలో తెలుగు వికీపీడియాలో ఏకంగా 11,500కు పైగా కొత్త వ్యాసాలను సృష్టించి చరిత్ర పుటల్లోకెక్కారు. 2016 సెప్టెంబర్‌ 8న ‘100 రోజులు–100 వికీ వ్యాసాలు’ ఛాలెంజ్‌తో ప్రారంభమైన ఆయన ప్రయాణం ఎలాంటి ఆటంకం లేకుండా పదేళ్ల మైలురాయికి చేరింది. 2026 సెప్టెంబర్‌ 7 నాటికి ఒక్కరోజు కూడా విరామం లేకుండా వ్యాసాలు రాసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు.

మైలురాళ్లు ఇలా..

100 రోజులు–100 వ్యాసాలు: 2016 సెప్టెంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 16 వరకు తొలి ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

వికీవత్సరం: 365 రోజుల్లో 365 వ్యాసాలు రాసి 2017 సెప్టెంబర్‌ 7న తొలి ఏడాది మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనతకు అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలపగా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో సత్కరించారు.

తెలంగాణ ఐటీ శాఖ అవార్డు: 2018 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఐటీ శాఖ అందించిన ‘లోకలైజేషన్‌’ అవార్డును అందుకున్నారు.

1000 నుంచి పదేళ్ల వరకు : 2019 జూన్‌ 4న వెయ్యి రోజులు (1000 వ్యాసాలు), 2020 అక్టోబర్‌ 17న 1500 రోజులు, 2022 మార్చి 1 నాటికి 2000 రోజుల్లో 3,015 వ్యాసాలను పూర్తి చేశారు. తాజాగా 3,652 రోజుల్లో 11,500కు పైగా వ్యాసాలతో పదేళ్ల మహా రికార్డును నెలకొల్పారు.

కొచ్చిలో ఘన సత్కారం..

ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని తెలుగు వికీమీడియన్స్‌ యూజర్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో ఆదివారం కేరళలోని కొచ్చిలో జరిగిన ‘వికీ కాన్ఫరెన్స్‌ ఇండియా–2026’లో వికీమీడియా ఫౌండేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యులు లోరెంజో లోసా, విక్టోరియా డోరోనినా పాల్గొని ప్రణయ్‌రాజ్‌కు జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషలకు చెందిన సుమారు 250 మంది వికీమీడియన్లు పాల్గొన్నారు.

వరుసగా పదేళ్ల పాటు ప్రతిరోజూ

వికీపీడియాలో వ్యాసాల రచన

3,652 రోజుల్లో 11,500కు పైగా కొత్త ఆర్టికల్స్‌ సృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement