యాదగిరిగుట్ట : ఎస్‌ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా అర్హులైన ప్రతిఒక్కరి పేరు జాబితాలో ఉండేలా అధికారులమంతా సమన్వయంతో పనిచేద్దామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి సూచించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 148 పోలింగ్ స్టేషన్‌ను ఆయన ఆదివారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లు, దరఖాస్తూదారులు తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలన్నారు. అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం 6, ఫారం7, ఫారం 8 ద్వారా క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ సమర్పించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, తహసీల్దార్ గణేష్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ ఉన్నారు.
యాదగిరి క్షేత్రంలో శ్రీసుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రథమ ప్రాకార మండపంలో ఆదివారం అర్చకులు శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని భక్తుల నడుమ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం చేపట్టారు. అనంతరం స్వయంభూ పంచనారసింహులకు బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం నిర్వహించి, నిజాభిషేకం జరిపి సహస్రనామార్చన విశేషంగా చేపట్టి, తులసీ దళాలతో అర్చించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు విశేషంగా జరిపించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో వేద ఆశీర్వచనం పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.
జిల్లా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలి
భువనగిరిటౌన్ : జిల్లాలోని దీర్ఘకాలిక పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై శాసనసభ సమావేశాల్లో జిల్లా ఎమ్మెల్యేలు గళమెత్తాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున వారిని నిలదీస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చర్లగూడెం రిజర్వాయర్ పురోగతిపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా పరిధిలో మూసీ ప్రక్షాళన, గోదావరి జలాల అనుసంధానం, ఫీడర్ ఛానళ్ల ఏర్పాటుపై చర్చించాలని కోరారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధనకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ శాంతికోసం పోరాడుదాం
సూర్యాపేట అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం, హింస, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుదామని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఏఐపీఎస్‌ఓ) రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్‌లో నిర్వహించిన ఏఐపీఎస్‌ఓ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధాల వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, మహిళలు, పిల్లలు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐపీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు తొగిట్టి మురళి, గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్, కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


