భువనగిరిటౌన్ : అప్పుడే గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 14న చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సారి పర్యావరణహిత మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ఎలాంటి ప్రచారం చేయడం లేదు. రసాయన రంగులతో తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలు వాడొద్దంటూ గతంలో మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి యంత్రాంగం ముమ్మర ప్రచారం నిర్వహించేది. ఈ సారి ఎక్కడా ఆ ఊసే కనిపించడం లేదు. ఉత్సవాలకు కొద్దిరోజులే సమయం ఉన్నప్పటికీ ఎక్కడా మట్టి విగ్రహాల ప్రస్తావనే వినిపించడం లేదు. ఫలితంగా భువనగిరి జిల్లాకేంద్రంతో పాటు చౌటుప్పల్, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లిలో పీవోపీ విగ్రహాలే విక్రయానికి దర్శనమిస్తున్నాయి.
గతంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని..
జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఇళ్లల్లో పూజలు చేసే విగ్రహాల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. వీటిలో అధిక శాతం పీవోపీ ప్రతిమలే ఉంటాయి. ఉత్సవాల అనంతరం స్థానిక చెరువులు, కుంటలు, మూసీ పరీవాహక ప్రాంతాలు, కాలువల్లో వీటిని నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితం కావడంతోపాటు వ్యర్థాల తొలగింపు పంచాయతీలు, మున్సిపాలిటీలకు తీవ్ర భారంగా మారుతోంది. గతంలో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రధాన కూడళ్లు, రహదారులపై మట్టి గణపతులను ప్రదర్శించి ప్రజలను ఆలోచింపజేశారు. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు.
ఉచిత పంపిణీ జరిగేనా..
గతంలో జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే పట్టణాలు, గ్రామాల వారీగా ప్రతిమల పంపిణీ జరిగేది. అయితే ఈ ఏడాది ఆ రెండు నియోజకవర్గాల్లో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ ఉంటుందా లేదా అనే విషయంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి మట్టి విగ్రహాల పంపిణీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
ఫ పండుగొస్తున్నా.. పట్టని యంత్రాంగం
ఫ అప్పుడే మొదలైన పీవోపీ ప్రతిమల విక్రయాలు
ఫ ఉచిత విగ్రహాల పంపిణీపైనా ఊసేలేదు


